పల్నాడులో భయం… భయం

  • పోలీసుల డేగ కన్ను
  • అల్లర్లు జరగకుండా భారీ బందోబస్తు

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి, సత్తెనపల్లి రూరల్‌ (పల్నాడు జిల్లా) : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజున రాష్ట్రంలోనే అత్యధికరగా ఘర్షణలు జరిగిన పల్నాడు జిల్లాలో పరిస్థితి ప్రస్తుతం నిరువుగప్పిన నిప్పులా ఉంది. గత అనుభవాల దృష్ట్యా కౌంటింగ్‌ అనంతరం ఘర్షణలు చోటుచేసుకొని అవకాశం ఉందని ప్రజలు భయాందోన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాపై పోలీసులు డేగ కన్ను వేశారు. అల్లర్లు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు నరసరావుపేటలోని జెఎన్‌టియు కళాశాలలో మంగళవారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాల అనంతరం పరిస్థితులు ఎలా ఉంటాయోనని ప్రధాన పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు ప్రజల్లోనూ భయం నెలకొంది. గత ఐదేళ్లుగా వైసిపి వారు టిడిపి వారిని తీవ్రంగా వేధించారన్న విమర్శలు ఉన్నాయి. టిడిపి గెలిస్తే వైసిపి వారిపై పగ తీర్చుకొనే అవకాశం ఉందని, వైసిపి గెలిస్తే టిడిపి వారిపై మళ్లీ దాడులు జరిగే అవకాశం ఉందని సర్వత్రా భావిస్తున్నారు. పల్నాడు జిల్లాలో ఏ పార్టీ గెలిచినా ప్రత్యర్థి పార్టీలపై దాడులు జరుగుతాయని నిఘా వర్గాలూ హెచ్చరించడంతో దాదాపు నాలుగు వేల మంది పోలీసులు సమస్యాత్మక గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎన్నికల పోలింగ్‌కు వారం ముందు నుంచే అదనపు బలగాలు జిల్లాకు వచ్చాయి. అయినా, గత నెల 13న పోలింగ్‌ రోజున, అనంతరం రెండు రోజులపాటు ఘర్షణలు జరిగాయి. దీంతో, మరింతమంది అదనపు బలగాలు కావాలని ఎన్నికల కమిషన్‌కు అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మరో 19 కంపెనీల అదనపు బలగాలు గత నెల మూడో వారంలో జిల్లాకు చేరాయి. పోలింగ్‌ రోజున ఘర్షణలకు సంబంధించి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మూడు హత్యాయత్నం కేసులు, ఇవిఎం ధ్వంసం కేసులతోపాటు మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిపై ఆయన హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ పొంది ప్రస్తుతం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో బస చేసి రోజూ ఎస్‌పి కార్యాలయంలో సంతకం చేసి వెళ్తున్నారు. పోలింగ్‌ సందర్భంగా జరిగిన అల్లర్లలో పోలీసులు 161 కేసులు నమోదు చేసి 1320 మందిని అరెస్టు చేశారు. గత నెల 11 నుంచి జిల్లాలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. పల్నాడు జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి ఈ నెల 5వ తేదీ వరకు దుకాణాలను మూసివేయాలని పోలీసు ఆదేశించారు. అన్ని పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే జిల్లా కలెక్టర్‌, ఎస్‌పిల ఆధ్వర్యంలో ప్రజల్లో భరోసా నింపేందుకు మార్చ్‌ఫాస్టు ర్యాలీలు నిర్వహించారు. జిల్లా ఎస్‌పి మల్లికా గర్గ్‌ ఓట్ల లెక్కింపు, ఫలితాల అనంతరం ఎక్కడా ఘర్షణలు జరగడానికి వీల్లేదని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

పెట్రోల్‌ బాంబుల తయారీ సామగ్రి
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లిలోని గుర్రాల జగన్‌మోహన్‌ర ావుకు చెందిన మామిడి తోటలో అడిషనల్‌ ఎస్‌పి సోమశేఖర ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో చేపట్టగా గడ్డి వామిలో దాచిన నాలుగు లీటర్ల పెట్రోల్‌, 18 ఖాళీ సీసాలు, తొమ్మిది మద్యం సీసాలు లభ్యమయ్యాయి. నిందితుడిని, ఆయన తండ్రి సుధాకరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

➡️