గిరిజన, ఆదివాసీ హక్కుల పరిరక్షణే లక్ష్యం 

Jan 4,2024 08:34 #ST Commission, #tribals
గిరిజనం

 

  • ఎస్‌టి కమిషన్‌ ఛైర్మన్‌ డివిజి శంకరరావు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో గిరిజన, ఆదివాసీ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఎస్‌టి కమిషన్‌ పనిచేస్తోందని కమిషన్‌ ఛైర్మన్‌ డివిజి శంకరరావు అన్నారు. విజయవాడలోని ఎస్‌టి కమిషన్‌ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌ హాలులో బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో రాజ్యాంగ బద్ధంగా ఎస్‌టి కమిషన్‌ ఏర్పాటైందన్నారు. ఎస్‌టిల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. గ్రీవెన్స్‌ సెల్‌ ద్వారా 2022లో 2,751, 2023లో 2,712 ఫిర్యాదులు అందాయని తెలిపారు. వీటిలో 432 ఫిర్యాదులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, అవి కూడా సంబంధిత శాఖల్లో పరిష్కారానికి చివరి దశలో ఉన్నట్లు ఆయన తెలిపారు. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పర్యటించి గిరిజనులు, ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యకలాపాలను సమీక్షించామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక యాప్‌ ద్వారా అర్జీలు స్వీకరించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. గిరిజనులకు వారి గ్రామంలోనే ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా మెరుగైన వైద్యం అందుతోందని ఎస్‌టి కమిషన్‌ సభ్యులు వడిత్యా శంకర్‌ నాయక్‌ తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్‌టి కమిషన్‌ సెక్రటరీ రామశేషు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️