రాష్ట్రపతి, గవర్నర్ల విడిది కోసమే నిర్మించాం

  • రుషికొండ భవనాలపై దుష్ప్రచారం తగదు
  •  మాజీ మంత్రి అమర్‌నాథ్‌

ప్రజాశక్తి – మధురవాడ (విశాఖపట్నం) : రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నగరానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు వచ్చినప్పుడు వారికి సరైన విడిది సౌకర్యం లేదని, దీనిని దృష్టిలో పెట్టుకునే సదరు రుషికొండపై భవనాలను నిర్మించామని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. వీటిని విఐపిలు, వివిఐపిలకు కేటాయించే అవకాశం ఉన్నందున భద్రతను దృష్టిలో పెట్టుకునే ఇప్పటివరకూ బహిర్గతం చేయలేదని తెలిపారు. ఈ భవనాలపై దుష్ప్రచారం తగదన్నారు. సోమవారం ఎండాడలోని వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అవసరాల కోసమే రుషికొండపై భవనాలను నిర్మించామని, అయితే వాటిని వైసిపి నాయకుల సొంతానికే నిర్మించుకున్నారంటూ ప్రజలను ఏమార్చే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతోందని విమర్శించారు. ఈ నిర్మాణాలకు ముందు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులతో కూడిన కమిటీని వేశామని, ఆ కమిటీ ఇచ్చిన సూచనలు మేరకే ముందుకు సాగామని తెలియజేశారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ భవనాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న దానిపై ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. రుషికొండ భవనాల పేరిట జగన్‌మోహన్‌ రెడ్డిపైనా, పార్టీపైనా చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి పాల్గొన్నారు.

➡️