మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై రాళ్ల దాడి

ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం :మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఎన్‌టిఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగి రమేష్‌ ఇంటిపై కొందరు యువకులు రాళ్లు రువ్వారు. ఎపి 39 కెడి 3267 కారులో వచ్చిన నలుగురు దుండగులు జోగి ఇంటి ముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను విసిరారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసు కానిస్టేబుల్‌ పట్ల దురుసుగా ప్రవర్తించారు. కానిస్టేబుల్‌ ప్రతిఘటించడంతో వారు వచ్చిన కారులో వెళ్లిపోయారు. దాడి సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. దాడి చేసిన వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దాడి విషయం తెలుసుకున్న వైసిపి నాయకులు, కార్యకర్తలు జోగి రమేష్‌ ఇంటికి వచ్చారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. జోగి రమేష్‌ ఇంటిపై టిడిపి నేతలు దాడికి దిగుతారని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయన ఇంటి చుట్టూ ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. అయినా దుండగులు దాడికి పాల్పడ్డారు.

➡️