షీలా బిడే నివేదిక ప్రకారం ముందుకు..

Jun 29,2024 23:18 #minister narayana, #press meet
సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యం

-విభజన ఆస్తులపై సమీక్షలో మంత్రి నారాయణ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :హైదరాబాద్‌లో ఉన్న ఎపి ఆస్తులకు సంబంధించిన అంశంలో షీలాబిడే కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి చట్టంలో నుండి హైదరాబాద్‌ వేరుపడటంతో ఇప్పుడు అక్కడున్న ఆస్తుల పంపిణీ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం సిఆర్‌డిఏ కార్యాలయంలో విభజన ఆస్తులకు సంబంధించిన అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. ఈ చర్చల్లో పట్టణాభివృద్దిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్తుల విషయంలో నెలకొన్న విషయాలపై అధికారులు మంత్రికి వివరించారు. అలాగే హైదరాబాద్‌లో ఉన్న ఎపి హౌసింగ్‌ బోర్డు, డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ ఆస్తులపై గతంలోనే ఆస్తులు, అప్పులు జనాభా ప్రాతిపదికన విభజించిన అంశాలనూ ఎక్స్‌పర్ట్‌ కమిటీ ముందుంచినట్లు మంత్రికి వివరించారు. కమిటీ సిఫార్సులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, తెలంగాణా నుండి రూ.5179 కోట్ల ఎపికి రావాల్సి ఉందని, ఆయా సంస్థల ఆస్తులకు సంబంధించి కోర్టుల్లో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.
కొనసాగుతున్న వివాదం
రాష్ట్ర విభజన పూర్తయి పదేళ్లు జరిగినా ఇప్పటికీ రూ.వేల కోట్ల ఆస్తులకు సంబంధించిన అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తొమ్మిది, పదో షెడ్యూలలో ఉన్న ఆస్తులు అప్పులు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేసుకోవాల్సి ఉంది. అనంతరం తెలంగాణ ప్రాంతం ఎక్కడ ఆస్తులు అక్కడే ఉండాలనే విధంగా కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఇప్పటికీ కొన్ని సంస్థల విషయంలో పీటముడి వీడటం లేదు. వాటిల్లో మున్సిపల్‌శాఖకు చెందిన ఆస్తులూ ఉన్నాయి.

➡️