లెనిన్‌ స్ఫూర్తితో ముందుకు

Apr 22,2024 20:50 #BV Raghavulu, #IV Lenin, #Jayanti
  • జయంతి కార్యక్రమంలో బివి రాఘవులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దోపిడీ రహిత సమాజమైన సోషలిజం కోసం లెనిన్‌ చూపిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపునిచ్చారు. విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌లో వామపక్ష పార్టీలు లెనిన్‌ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించాయి. లెనిన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి బివి రాఘవులు మాట్లాడుతూ సమాజం మార్పును కోరుకునే వారికి లెనిన్‌ జీవితం నుంచి ఎన్నో నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా పోరాట పంథాను వదలకూడదు అనేది లెనిన్‌ ఆశయమన్నారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా లెనిన్‌ పోరాట పంథాను వదలలేదన్నారు. ఆయన సన్నిహితులు నిరుత్సాహంతో పోరాటానికి దూరం అయినా లెనిన్‌ మనోస్థైర్యంతో కొనసాగించారని తెలిపారు. పోరాటం లేకుండా ఏదీ సాధ్యం కాదని, పోరాటమే ఊపిరిగా పనిచేయాలని కోరారు. ప్రకృతిలో, ప్రజల్లో, సమాజంలో ప్రతిచోటా పోరాటం వుంటుందని, వీటన్నింటి కంటే ముఖ్యమైంది వర్గ పోరాటమని అన్నారు. ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త వర్గపోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, సిపిఐ(ఎమ్‌ఎల్‌) న్యూ డెమోక్రసి నాయకులు పోలారి, శాంతి సంఘం నాయకులు అరుణ్‌కుమార్‌ తదితరులు మాట్లాడుతూ సమసమాజం మార్క్సిజం ద్వారానే సాధ్యమని నమ్మడమే కాదు ఆచరణలో పోరాటాల ద్వారా సాధించిన మహోన్నతుడు లెనిన్‌ అని చెప్పారు. కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని మాట్లాడే పెట్టుబడిదారీ విధానానికే కాలం చెల్లిందని అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయని అన్నారు. అసమానతలు లేని సోషలిజం అజేయమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ నాయకులు జయరామ్‌, సిపిఐ నాయకులు పి జమలయ్య, మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️