4 నెలల్లో.. మరో నాలుగు రాకెట్‌ ప్రయోగాలు : ఇస్రో చైర్మన్‌

ప్రజాశక్తి-తిరుపతి : రాబోయే నాలుగు నెలల్లో నాలుగు రాకెట్‌ ప్రయోగాలు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ తెలిపారు. ఈరోజు శ్రీహరికోట నుంచి ప్రయోగించే GSLV-F14 రాకెట్‌ విజయవంతం కావాలని శ్రీ చెంగాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. GSLV-F14  ద్వారా INSAT -3DS ఉపగ్రహన్ని ఈ రోజు సాయంత్రం 5.35 కి ప్రయోగిస్తున్నామని తెలిపారు. ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్‌ డౌన్‌ సాఫీగా సాగుతోందని తెలిపారు. ఈ ఉపగ్రహం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాతావరణ పరిస్థితులు, తుఫాన్‌ లాంటి విపత్తులు, వర్షాభావ పరిస్థితులు, మేఘాల గమనాలు, సముద్ర ఉపరితల మార్పులపై స్పష్టమైన సమాచారం అందజేస్తుందని వెల్లడించారు. ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న సమాచార ఉపగ్రహాలలో కొన్నింటికి కాలం చెల్లడంతో వాటి స్థానంలో అత్యధిక పరిజ్ఞానం కలిగిన ఉపగ్రహాలను పంపిస్తున్నామని తెలిపారు. ఈ ఉపగ్రహం ఐదు నుంచి పది సంవత్సరాలు పనిచేస్తుందని.. ఇలాంటి కమ్యూనికేషన్‌ సాటిలైట్లు రాబోయే కాలంలో మరిన్ని ప్రయోగిస్తామని తెలిపారు. రాబోయే నాలుగు నెలల్లో నాలుగు రాకెట్‌ ప్రయోగాలు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక, GSLV F15 ద్వారా NISSAR  ఉపగ్రహ ప్రయోగం జూన్‌ లో ఉంటుందని ప్రకటించారు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌.

➡️