11నుంచి టిడిపి ‘శంఖారావం’ – రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి పధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈ నెల 11వ తేదీ నుంచి ‘శంఖారావం’ పేరుతో మరో యాత్ర నిర్వహించనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు తెలిపారు. రానున్న ఎన్నికలకు పార్టీ కేడర్‌ను కార్యోన్ముఖులను చేసే లక్ష్యంతో యాత్ర సాగనుందని తెలిపారు. వైఎస్‌ జగన్‌ కుట్రలు, కుతంత్రాల వల్ల చంద్రబాబు జైలుకు వెళ్లడంతో లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర అనుకున్న విధంగా ముందుకుసాగలేదని, కొన్ని నియోజకవర్గాల్లో కొనసాగించలేకపోయారని చెప్పారు. టిడిపి కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభం కానున్న లోకేష్‌ శంఖారావం యాత్ర 11 రోజుల పాటు 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగుతుందన్నారు. వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమంలో ప్రభుత్వ వైఫల్యాలు, దోపిడీ విధానాలను ప్రజల్లో ఎండగడతారని చెప్పారు. అదే సమయంలో వివిధ వర్గాలకు భరోసా కల్పిస్తూ అధినేత ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎంఎ షరీఫ్‌, టిడి జనార్ధన్‌, నిమ్మల కిట్టప్ప పాల్గొన్నారు.

నిరంకుశ పాలనకు నిదర్శనం

డిమాండ్ల పరిష్కారం కోసం చలో విజయవాడ చేపట్టిన ఆశా వర్కర్లపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడం జగన్‌ నియంతృత్వ పాలనకు పరాకాష్ట అని, ఈ చర్యను ఖండిస్తున్నట్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఐదేళ్లుగా ఆశాలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న జగన్‌ వారి సమస్యలను పరిష్కరించక పోవడం దుర్మార్గం కాదా అని గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నిం చారు. బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసులు అధికార వైసిపికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆశాలకు రూ.10 వేలు వేతనం ఇస్తానని ముఖ్యమంత్రిగా మొదటి సంతకం చేసిన జగన్‌ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. వారి డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

➡️