జగన్‌పై దాడి కేసులోనిందితుడికి బెయిల్‌ ఇవ్వండి

  •  హైకోర్టులో వాదనలు

ప్రజాశక్తి-అమరావతి: విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా జరిగిన కత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావుపై హత్యాయత్నం (ఐపిసి 307) సెక్షన్‌ కింద కేసు నమోదు చేయడాన్ని ఆయన తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ త్రిదీప్‌ పైస్‌ ఆన్‌లైన్‌ ద్వారా హైకోర్టులో వాదించారు. ప్రస్తుతం సిఎంగా ఉన్న జగన్‌కు అప్పుడు స్వల్ప గాయమే అయ్యిందని, దాడి తర్వాత విమానంలో హైదరాబాద్‌ కూడా వెళ్లిపోయారని చెప్పారు. ఈ కేసులో 55 మంది సాక్షులు ఉంటే ఇప్పటికి ఒకే ఒక్క సాక్ష్యాన్ని నమోదు చేశారన్నారు. తీవ్ర కాలయాపన చేస్తున్నారని, నేటికీ జైలులోనే పిటిషనర్‌ ఉన్నారని చెప్పారు. విశాఖలోని ఎన్‌ఐఎ కోర్టు బెయిలు మంజూరుకు నిరాకరిస్తూ గత సెప్టెంబరు 22న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి బెయిల్‌ మంజూరు చేయాలంటూ నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్‌ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ ఎం కిరణ్మయితో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం విచారణ జరిపింది. విచారణను ఈ నెల 20కు వాయిదా వేసింది.

➡️