ఘనంగా అన్నమయ్య జయంతి వేడుకలు

May 23,2024 21:55 #Annamayya Jayanthi, #Celebrations

ప్రజాశక్తి-రాజంపేట రూరల్‌ :తెలుగు పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య 616వ జయంతి ఉత్సవాలు గురువారం అన్నమయ్య జిల్లా తాళ్ళపాకలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత తాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద శ్రీవారి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్‌ దీక్షితుల ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ వేడుక నిర్వహించారు. అంతకుముందు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఉదయం 9 నుండి 10 గంటల వరకు బృందగానం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు తిరుపతికి చెందిన గాయకులు ఉదయభాస్కర్‌, హేమమాలిని అన్నమయ్య గీతాలు ఆలపించారు. అనంతరం తిరుపతికి చెందిన శ్రీనివాస్‌ బృందం హరికథ గానం చేశారు. ఈ వేడుకల్లో అన్నమాచార్య ప్రాజెక్ట్‌ సంచాలకులు విభీషణ శర్మ, విశాఖపట్నం శారద పీఠాధిపతి స్వరూపానంద తదితర ప్రముఖులు పాల్గన్నారు. కాగా ఈ నెల 25న రాజంపేట-కడప హైవేలో ఉన్న 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద శ్రీవారి ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు.

➡️