అవ్వాతాతలు పింఛన్ల కోసం అవస్థలు పడకూడదు : సిఎం జగన్‌

పల్నాడు : సిఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజు సోమవారం పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. వెంకటాచలంపల్లిలో సామాజిక పింఛన్‌ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడారు.

అప్పట్లో పెన్షన్‌ ఎంత వచ్చేది … గత ప్రభుత్వంలో పెన్షన్‌ ఎంతమందికి వచ్చేది … అవ్వాతాతలు ఆలోచించాలని సిఎం జగన్‌ కోరారు. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ వచ్చేదని చెప్పారు. ఇప్పుడు వైసిపి ప్రభుత్వంలో పింఛన్ల విషయంలో వచ్చిన మార్పును గమనించాలన్నారు. అవ్వాతాతలు పెన్షన్‌ కోసం అవస్థలు పడకూడదనేది తన కోరిక అని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్‌ వ్యవస్థ తీసుకొచ్చామని ముఖ్యమంత్రి అన్నారు. వాలంటీర్లతో నేరుగా అవ్వాతాతల ఇంటికే పెన్షన్‌ పంపించామని, 56 నెలలుగా ప్రభుత్వం 1వ తేదీ ఉదయమే పెన్షన్‌ అందించిందని తెలిపారు. గత ప్రభుత్వం అరకొరగా పెన్షన్‌ ఇస్తూ ఉంటే దానిని మార్పు చేశామని అన్నారు. అర్హత ఉంటే చాలు ప్రతీ ఒక్కరికీ పెన్షన్‌ అందించామన్నారు. నేడు రాష్ట్రంలో 66 లక్షల మందికి పైగాపెన్షన్‌ అందిస్తున్నామన్నారు. రూ.3 వేల వరకూ పెన్షన్‌ పెంచుకుంటూ వచ్చామన్నారు. 14 ఏళ్లు సిఎంగా చేశానని చంద్రబాబు చెబుతుంటారు… ఏ రోజైనా చంద్రబాబు అవ్వాతాతల గురించి ఆలోచన చేశారా ? అని ప్రశ్నించారు. రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయాయని, విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు వచ్చేశాయని చెప్పారు. వీటిని మార్చేందుకు తాను అడుగులు ముందుకు వేస్తున్నానన్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టో అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పారు కానీ ఎన్నికల తర్వాత ఆ మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేశారని జగన్‌ విమర్శించారు. చంద్రబాబు, వారి కూటమిలా నోటికొచ్చిన అబద్ధాలు తాను చెప్పలేనన్నారు. తాను ఏదైనా చెబితే చేసి చూపిస్తానన్నారు. జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదేనని సిఎం తెలిపారు. రూ.3 వేల ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదని చెప్పారు. నెలకు రూ. రెండు వేల కోట్లు పెన్షన్లకే ఇస్తున్నామని అన్నారు. 58 నెలలుగా పెన్షన్ల కోసం రూ.90 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పేదలకు మంచి చేసే విషయంలో జగన్‌తో పోటీపడే వారు దేశంలోనే లేరు అని అన్నారు. 2014లో చంద్రబాబు హామీలిచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు. మోసం చేసేవారిని నమ్మొద్దని కోరుతున్నానన్నారు. చంద్రబాబు హామీల ఖర్చు రూ.లక్షా 40 వేల కోట్లు దాటిపోతున్నాయని, అందరినీ మోసం చేసేందుకే ఇలాంటి హామీలు ఇస్తున్నారు అని అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే.. పులి నోట్లో తలపెట్టినట్టేనని సిఎం జగన్‌ ఎద్దేవా చేశారు.

➡️