నేలవాలిన పంటలు

May 9,2024 06:20
  •  అరటి, టమోటా, చిక్కుడుకు అపార నష్టం
  •  పిడుగుపాటుకు 140 గొర్రెలు మృత్యువాత

ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్రంలో కురిసిన అకాల వర్షానికి అన్నదాతల్లో అలజడి రేగింది. కష్టపడి సాగు చేసిన పంటలు నేలకొరగడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నంద్యాల జిల్లా మహానంది మండలంలో మంగళవారం రాత్రి పెనుగాలులతో కురిసిన వర్షానికి 750 ఎకరాల్లో అరటి పంటకు నష్టం వాటిల్లింది. గడివేముల మండలం పెసరవాయి గ్రామ శివారులో వెంకటేశ్వర స్వామి గుడి పక్కన పిడుగుపడి 40 గొర్రెలు మృతి చెందాయి. నందికొట్కూరు మండలం మల్లెల గ్రామంలో పిడుగుపడి రెండు కోడెదూడలు మృత్యువాతపడ్డాయి. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని పడమటి పంచాయతీలైన కీలపల్లి, బాలేపల్లి, గండ్రాజుపల్లి, ఊగిని, గుండిగళ్ళు గ్రామాలలో మంగళవారం రాత్రి వీచిన గాలివానకు టమోటా, చిక్కుడు, మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం చిక్కుడుకు మార్కెట్‌లో కిలో రూ.60లు ధర ఉండటంతో వర్షం కారణంగా నష్టపోయామని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, చింతపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మాల్యవంతుని పాడులో పిడుగుపడి వంద గొర్రెలు మృతి చెందాయి. వీటి విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని బాధితులు తెలిపారు. పొదిలిలో తమలపాకు తోటలు పూర్తిగా నేలవాలాయి.

➡️