అర్ధాకలితో మిడ్డేమీల్స్‌ కార్మికులు

Dec 22,2023 11:07 #middaymeals workers, #Vijayawada
  • ధరలకనుగుణంగా పెరగని బడ్జెట్‌
  • అమలుకు నోచుకోని కనీస వేతనం
  • సమస్యల పరిష్కారం కోసం 5న ‘చలో విజయవాడ’

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : విద్యార్థులకు అన్నంపెట్టి కడుపు నింపుతున్న మిడ్డేమీల్స్‌ కార్మికులు మాత్రం అర్ధాకలితో అలమటిస్తున్నారు. కనీస వేతనాలు లేక, బిల్లులు సకాలంలో విడుదల కాక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. పాఠశాలల సెలవులు మినహా నెలంతా వండి పెట్టినా వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పట్టుమని రూ.3వేలు కూడా ఇవ్వడం లేదు. మధ్యాహ్న భోజన కార్మికులు పనికి భద్రత కల్పించడంతోపాటు మెస్‌ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలని, కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకున్న దాఖలాలే లేవు. జిల్లాలో 980 స్కూళ్లలో మధ్యాహ్న భోజనాన్ని కార్మికులు వండి పెడుతున్నారు. వీటిలో 706 ప్రాథమిక, 85 ప్రాథమికోన్నత, 189 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి వండి పెట్టడానికి అవసరమైన నూనె, పోపు గింజలు, పప్పు, ఉప్పు, చింతపండు, కూరగాయలు, వంట చెరుకు తదితర సామగ్రి కోసం రూ.4.97 పైసలు, హైస్కూల్‌ విద్యార్థులకు రూ. 7.45 పైసలను మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. కనీసం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.10, హై స్కూల్‌ విద్యార్థులకు రూ.20 చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు. సోమ, బుధ, శుక్రవారాల్లో మూడు రోజులపాటు కోడిగుడ్డు కూడా మెనూలో భాగంగా ఉంది.అయితే మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా ఒక్కో విద్యార్థి కోసం ఇచ్చే నగదును మాత్రం ప్రభుత్వం పెంచడం లేదు. సబ్సిడీపై వంటగ్యాస్‌ అందించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పూెర్తిగా పెడచెవిని పెట్టింది. రాగి జావ పంపిణీకి అదనపు అలవెన్సులను చెల్లించట్లేదు.

  • రాజకీయ జోక్యంతో ఇబ్బందులు

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగనన్న గోరుముద్ద పేరుతో మెనూలో మార్పులు చేసింది. ఆ మార్పులు తగినట్లుగా బిల్లులు మాత్రం పెంచలేదు. మరోవైపు పిఎంసి కమిటీలను నియమించింది. దీంతో రాజకీయ జోక్యం పెరిగింది. మధ్యాహ్న భోజన కార్మికుల అక్రమ తొలగింపులు, పని ప్రదేశాల్లో ఇబ్బందులకు గురి చేయడం సర్వసాధారణంగా మారాయి. నాణ్యత తగ్గినా, కూరలు, పప్పులు సరిపోయినంత ఇవ్వకున్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాథమిక స్థాయి పిల్లలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం వంద గ్రాముల బియ్యం ఇస్తుంది. గ్రామీణ ప్రాంతాల పిల్లలు అల్పాహారం తీసుకునే అలవాటు లేకపోవడం అందుకు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో మధ్యాహ్న భోజనంపైనే ఆధారపడుతున్నారు. అలాంటి విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న 100 గ్రాములు, 150 గ్రాముల బియ్యం సరిపోవట్లేదు. అదనంగా పిఎంసి కమిటీ సభ్యులూ అక్కడే భోజనం చేయడం ఫలితంగా కొన్నిచోట్ల భోజనం సరిపోవడం లేదు. దీనికీ కార్మికులనే బాధ్యులను చేస్తున్నారు. చాలా చోట్ల కట్టెల పొయ్యే దిక్కుమధ్యాహ్న భోజనం వండేందుకు ప్రభుత్వం గ్యాస్‌ సరఫరా చేయాలని, మెస్‌ చార్జీలు కాకుండా వంట సరుకులు కూడా సరఫరా చేయాలని కొన్నేళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదు. గ్యాస్‌ భారం తట్టుకోలేక, అంత స్థోమత లేక ఇంయా చాలా చోట్ల కట్టెల పొయ్యిపైనే వంట చేయాల్సి వస్తుంది. దీనికి వంట చెరకును వారే సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. దీంతో పొయ్యి నుంచి వచ్చే పొగ వల్ల కార్మికులు ఆరోగ్యపరమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. కార్మికుల్లో అత్యధిక మంది అస్తమా, ఎలర్జీలాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. గ్యాస్‌పై వంట చేస్తున్నా వీరికి భారం తప్పట్లేదు. మూడు, నాలుగు నెలలకు ఒకసారి గాని బిల్లులు రావట్లేదు. దీంతో కార్మికులే అప్పోసప్పో చేసి గ్యాస్‌ బండలను వేయించుకుంటున్నారు. అలాగే సరుకులకు సంబంధించి కూడా బిల్లులు సకాలంలో చెల్లించట్లేదు. జిల్లాలో నవంబరు నెల బకాయిలు రూ.57.75లక్షల వరకూ బకాయిలున్నాయి. ప్రతి నెలా మండల విద్యాధికారి జిల్లా అధికారులకు బిల్లును పంపగా అక్కడ నుంచి రాష్ట్ర ఫైనాన్స్‌ విభాగానికి వెళ్తాయి. నిధుల లభ్యతను బట్టి మూడు, నాలుగు నెలలకొకసారి ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ అయ్యాడ డబ్బు చెల్లిస్తున్నారు. అప్పటికే అప్పులకు వడ్డీలు కట్టలేక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

  • సమస్యలను పరిష్కరించాలి

మిడ్డే మీల్స్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. 20 ఏళ్లుగా పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నాం. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లించే రేట్లకు మార్కెట్‌లో సరుకులు రావడం లేదు. నెలల తరబడి బకాయిలు నిలిపివేయడంతో సొంత డబ్బులు పెట్టాల్సి వస్తుంది. మరికొందరు అప్పులు చేసి పథకాన్ని నడుపుతున్నారు.కట్టెల పొయ్యి వాడకం ఫలితంగా చాలామంది అనారోగ్యాల పాలవుతున్నాం. నిత్యావసర సరుకులు, గ్యాస్‌ను ప్రభుత్వమే పంపిణీ చేయాలి. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.10, హై స్కూల్‌ విద్యార్థులకు రూ.20 చొప్పున చెల్లించాలి. ఈ నెల 5న జరిగే చలో విజయవాడను విజయవంతం చేయాలి.

ఎల్‌ఆర్‌.ఈశ్వరి, అధ్యక్షులు, మిడ్డే మీల్స్‌ కార్మికు సంఘం, సీతానగరం

➡️