అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య

May 22,2024 21:35 #committed suicide, #former

ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌ (శ్రీసత్యసాయి జిల్లా) :అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు… ధర్మవరం పట్టణంలోని శివానగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ, మహాలక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. లక్ష్మీనారాయణ కొంతకాలం క్రితం మరణించారు. పెద్ద కుమారుడు శీలా బాలచౌడయ్య (29)కు రెండేళ్ల క్రితం పద్మావతితో వివాహమైంది. భార్యాభర్తలు ఇద్దరూ కేశవనగర్‌లోని ఓ మగ్గాల బిల్డింగ్‌లో కూలిమగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. చౌడయ్య తల్లి మహాలక్ష్మీ ఇంట్లో సొంతమగ్గం ద్వారా చీరలను నేసేవారు. చౌడయ్య పెళ్లి, కుటుంబ పోషణ, ఇంట్లో మగ్గం నిర్వహణ కోసం దాదాపు రూ. నాలుగు లక్షల వరకు అప్పులు చేశారు. అటు కూలి మగ్గం ద్వారా, ఇటు సొంత మగ్గం ద్వారా ఆదాయం రాకపోవడంతో చేసిన అప్పులు తీర్చడం కష్టమయ్యింది. దీంతో చౌడయ్య తీవ్ర మానసిక ఆవేదనకు లోనయ్యేవారు. మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు చూసి కన్నీటి పర్యవంతమయ్యారు. వన్‌టౌన్‌ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని తల్లి, సోదరుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️