భూ కేటాయింపు రద్దు చేయాల్సింది రాష్ట్రమే : హైకోర్టు

Dec 7,2023 07:53 #land
high court on lands

ప్రజాశక్తి-అమరావతి : విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలో హయగ్రీవ ఫార్మ్స్‌, డెవలపర్స్‌కు 12.51 ఎకరాల భూ కేటాయింపు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దానిని రద్దు చేయడంపై రాష్ట్రం నిర్ణయం తీసుకోవచ్చునని హైకోర్టు చెప్పింది. జిల్లా కలెక్టరు నిర్ణయం తీసుకునేందుకు ఆస్కారం లేదని చెప్పింది. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నిర్ణయం తీసుకోవాలంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు భూమిని థర్డ్‌ పార్టీకి కేటాయింపులు చేయకుండా ప్రతివాదిని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌ రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎండాడలోని 92/3 సర్వే నెంబర్‌లో 12.51 ఎకరాలను హయగ్రీవ ఫార్మ్స్‌, డెవలపర్స్‌కు కేటాయింపును సవాల్‌ చేస్తూ జనసేన కార్పొరేటర్‌ పిఎల్‌ఎన్‌ మూర్తి యాదవ్‌, టిడిపి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వేర్వేరుగా వేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. కలెక్టరు రిపోర్టు, హయగ్రీవ సంస్థ వాదనల మేరకు తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది.

➡️