బనగానపల్లెలో హై టెన్షన్‌ – టిడిపి – వైసిపి ఘర్షణ

May 7,2024 21:46 #nandyala, #stone attack, #TDP

ప్రజాశక్తి -బనగానపల్లె (నంద్యాల) :నంద్యాల జిల్లా బనగానపల్లెలో హై టెన్షన్‌ నెలకొంది. మంగళవారం ఉదయం కూరగాయల మార్కెట్‌లో టిడిపి, వైసిపిలు ప్రచారం చేసుకుంటూ ఇరు గ్రూపులు ఒకరికొకరు ఎదురుపడడంతో ఘర్షణ నెలకొంది. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బిసి జనార్థన్‌ రెడ్డి సతీమణి బిసి ఇందిరారెడ్డి, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డి కోడలు మేధా శ్రీరెడ్డి, కుమారుడు ఓబుల్‌రెడ్డి ఒకేసారి కూరగాయల మార్కెట్‌లో ప్రచారానికి వచ్చారు. ఇరు గ్రూపులు కవ్వింపు చర్యలకు పాల్పడడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మార్కెట్‌లోని కర్రలు, కూరగాయల డబ్బాలు, కూరగాయలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దాడుల్లో వైసిపికి చెందిన నలుగురికి, టిడిపికి చెందిన ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నివాసం వద్ద, మాజీ ఎమ్మెల్యే బిసి జనార్థన్‌రెడ్డి నివాసం వద్ద బిఎస్‌ఎఫ్‌ పోలీసు బలగాలను మోహరించారు. ఘర్షణ పడ్డ వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ గంటా సుబ్బారావు తెలిపారు.
మహిళపై దాడి అమానుషం: జనార్థన్‌రెడ్డి
ఇందిర, టిడిపి కార్యకర్తలపై ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబుల్‌ రెడ్డి దాడులకు పాల్పడడం దారుణమని మాజీ ఎమ్మెల్యే బిసి జనార్థన్‌ రెడ్డి అన్నారు. కాటసాని ఓబుల్‌ రెడ్డి, వైసిపి కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
కఠిన చర్యలు తీసుకోవాలి: కాటసాని ఓబుల్‌ రెడ్డి
కూరగాయల మార్కెట్‌లో ప్రచారం నిర్వహిస్తున్న కాటసాని మేధా శ్రీ రెడ్డి, వైసిపి కార్యకర్తలపై దాడులకు పాల్పడిన టిడిపి కార్యకర్తలు, నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసిపి యువ నాయకులు కాటసాని ఓబుల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

➡️