జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు భారీ స్పందన

Dec 23,2023 10:40 #I&PR

ఐఅండ్‌పిఆర్‌ కమిషనరు విజరుకుమార్‌ రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాల కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఇప్పటి వరకు 5,765 దరఖాస్తులు అందాయని, జనవరి ఆరుతో గడువు ముగుస్తున్నందున అర్హులైన జర్నలిస్టులందరూ ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనరు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన జర్నలిస్టులందరికీ సంతృప్త స్థాయిలో ఇళ్ల స్థలాలు కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు. జిఓలో పేర్కొన్న నిబంధనల మేరకు అక్రిడిటేషన్‌ కార్డు పొందిన జర్నలిస్టుల వివరాలను, జర్నలిస్టుగా వారి వృత్తి అనుభవాన్ని సమాచార పౌర సంబంధాలశాఖ అధికారులు పరిశీలించిన అనంతరం ప్రాథమికంగా ధ్రువీకరించి ఇప్పటి వరకు 4,742 మంది అర్హులైన జర్నలిస్టుల జాబితాను వెరిఫికేషన్‌ కోసం ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపామన్నారు. మీడియాలో పనిచేసిన అనుభవ పత్రాలు పొందుపరచకపోవడం, సరైన అర్హతలు లేకపోవడం వంటి అంశాలకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న 935 మంది జర్నలిస్టుల దరఖాస్తులను సరిదిద్దుకునేందుకు మరో అవకాశం కల్పించామన్నారు. ఇప్పటి వరకు తొమ్మిది దరఖాస్తులు ధ్రువీకరణ కోసం పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఛైర్మన్‌గా జిల్లా కలెక్టరు, జిల్లా రెవెన్యూ అధికారి, సబ్‌ కలెక్టరు లేదా ఆర్‌డిఒ, డిఐపిఆర్‌ఒ, ముగ్గురు జర్నలిస్టులు సభ్యులుగా జిల్లా స్థాయి హౌసింగ్‌ కమిటీని 26 జిల్లాల్లో ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఆయా జిల్లాల్లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించాయని పేర్కొన్నారు. ప్రభుత్వ విలువ ప్రకారం 60 శాతం ప్రభుత్వం, 40 శాతం జర్నలిస్టులు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.

➡️