మోడీ మళ్లీ అధికారంలోకొస్తే నియంత పాలనే

  •  దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్‌

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : కేంద్రంలో మరోసారి మోడీ నాయకత్వంలో బిజెపి అధికారంలోకి వస్తే ఇక దేశంలో ఎన్నికలుండవని, నియంత పాలన వస్తుందని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్‌ ఆరోపించారు. విశాఖ విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో లౌకిక రాజ్యం ఉండదని, మనువాద మాఫియా దోపిడీ పాలన వస్తుందని, రాజ్యాంగానికి పూర్తిగా భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు అంతా ఐక్యం కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తూ దేశ సంపదను కార్పొరేట్ల చేతుల్లో బందీగా చేస్తున్న మోడీని ఎదుర్కోవడంలో రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పూర్తిగా విఫలం చెందాయని విమర్శించారు. ఈ మూడు పార్టీలు రాష్ట్రంలోని ప్రజలను వంచిస్తూ మోడీకి కొమ్ముకాస్తున్నాయన్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించి రానున్న ఎన్నికల్లో ఈ పార్టీలను ఓడించాలని కోరారు. సమావేశంలో పార్టీ విశాఖ పార్లమెంట్‌ అభ్యర్థి బి రమేష్‌, గాజువాక అభ్యర్థి ధర్మరాజు, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి కోన శంకరరావు, భీమిలి అభ్యర్థి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

➡️