మా సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తాం : అంగన్వాడీలు

అమరావతి : ఈనెల 31 వరకు శాంతియుతంగా పోరాడుతున్నామని… అప్పటికీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, న్యాయపరమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా గత 13 రోజులుగా నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు.

సోమవారం ఉదయం అంగన్వాడీ సంఘాలు ప్రెస్‌ మీట్‌ నిర్వహించాయి. ఎపి అంగన్వాడీ వర్కర్‌ సంఘాల ప్రెసిడెంట్‌ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ …. ముఖ్యమంత్రి జగన్‌… క్రిస్మస్‌ రోజునైనా అంగన్వాడీ అక్కాచెల్లెమ్మలకు తీపి కబురు చెబుతారని ఆశించాం కానీ… పండుగలు వారు చేసుకుంటున్నారనీ… అంగన్వాడీలు మాత్రం ఆకలిమంటలతో టెంట్లలో కూర్చుని ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి మానాలని కోరారు. వెంటనే అంగన్వాడీలకు వేతనాలను పెంచాలన్నారు. గ్రాట్యూటీ అమలుచేయాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మినీ వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా మారుస్తామని గతంలో జగన్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. దానికి సంబంధించిన జిఒను ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నిరంకుశవైఖరిని తట్టుకోలేక ఆందోళనతో అనారోగ్యం చెంది తూర్పుగోదావరిలోని ఓ అంగన్వాడీ కార్యకర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కార్యాలయాల తాళాలను పగలగొట్టి అంగన్వాడీల గుండెలను పగులగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆవేదనతో అనారోగ్యం చెంది తిరుపతిలో ఓ అంగన్వాడీ కార్యకర్త హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఉయ్యూరులో ఓ అంగన్వాడీ వర్కరు సమ్మె శిబిరంలో ఉండగానే సెంటర్‌లోనే గుండెపోటుతో మరణించారని కంటతడిపెట్టారు. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ప్రవర్తించడం దారుణమన్నారు. అర్థాకలితో చనిపోతున్న అంగన్వాడీలకు కనీస బీమా సౌకర్యం ఇవ్వకుండా, కనీస మట్టి ఖర్చులు కూడా ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చనిపోయినవారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కనీసం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలన్నారు. మట్టి ఖర్చులివ్వాలని కోరారు. ఇటీవల వైసిపి మంత్రి మాట్లాడుతూ … గ్రేడ్‌ 2 లో 560 అంగన్వాడీ పోస్టులు వైసిపి ప్రభుత్వంలో ఇచ్చామని చెప్పారనీ… ఇది పచ్చి అబద్ధం అని స్పష్టం చేశారు. సూపర్‌వైజర్ల పరీక్షలను పెట్టారు కానీ ఆ పోస్టులను మాత్రం ఇవ్వలేదని… ఇప్పటికీ అంగన్వాడీలు ఆ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు. ” సమ్మె చేయడం మా హక్కు…” కానీ తమ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి గవర్నమెంటు రకరకాల డిపార్ట్‌మెంట్‌లను తమపై ఉసిగొల్పుతుందని మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగులు కూడా వెనక్కు తగ్గాలని కోరారు. లేకపోతే సచివాలయాలను కూడా అంగన్వాడీలు ముట్టడిస్తారని హెచ్చరించారు. ఈనెల 31 వరకు శాంతియుతంగా పోరాడుతున్నామన్నారు. అప్పటికీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈనెల 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంఎల్‌ఎ ల ఇండ్లకు సామూహిక రాయబారాలు చేయాలని నిర్ణయించామని సుబ్బరావమ్మ ప్రకటించారు.

➡️