‘ఉక్కు’ ప్రయివేటీకరణ విరమించుకున్నట్టు బిజెపి ప్రకటించాకే..

Mar 31,2024 22:20 #Minister Botsa, #press meet

కూటమి పార్టీలు ప్రచారం చేపట్టాలి
-మంత్రి బొత్స
ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం):స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను విరమించుకున్నట్టు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే కూటమి పార్టీలైన టిడిపి, జనసేన, బిజెపిలు రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన విశాఖలోని లాసన్స్‌బే కాలనీలో వైసిపి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, రాష్ట్ర ప్రభుత్వం ఏనాడో దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని చెప్పుకొచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను అడ్డుకుంటామని ప్రగల్బాలు పలికిన టిడిపి, జనసేన పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రయివేటీకరణ చేసి తీరుతామని ప్రకటించిన బిజెపితో జతకట్టి విశాఖ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయని విమర్శించారు. ఉక్కును రక్షిస్తామని ప్రకటన చేయకుంటే ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ తిరగనివ్వబోరని గుర్తెరగాలన్నారు. బిసిలకు టిడిపి చేసిందేమీ లేదని విమర్శించారు. సీట్ల కేటాయింపులోనూ వారికి అన్యాయమే చేసిందన్నారు. ఎక్కడెక్కడో ఉన్న వారికి స్థానికతతో సంబంధం లేకుండా టికెట్లు ఇచ్చారని, లాబీయిస్టులుగా పనిచేసే వారికి సీట్లు కేటాయించారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మాభిమానంతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. నెలవారీ పింఛన్లు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్న వలంటీర్లపై చంద్రబాబు కక్షగట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల కోసం కూటమిలో చంద్రబాబు చేరలేదని, ప్రజల నుంచి ఎదురయ్యే తిరుగుబాటుకు, తిరస్కరణకు భయపడి ఆయన, ఆయన కొడుకు రక్షణ కోసమే బిజెపితో జతకట్టారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం నో వేకెన్సీ పాలసీని అమలు చేసిందన్నారు. 6,100 పోస్టులతో తాము డిఎస్‌సి ప్రకటించామని, వచ్చే ఏడాది నుంచి ఏడాదికోసారి ఖాళీలను బట్టి డిఎస్‌సిని ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విలేకర్ల సమావేశంలో వైసిపి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి, వైసిపి జిల్లా అధ్యక్షులు కోలా గురువులు పాల్గొన్నారు.

➡️