ఎన్‌డిఎ కూటమి అధికారంలోకొస్తే జగన్‌ జైలుకే..

Apr 24,2024 22:53 #rajnadhsingh, #speech

– అనకాపల్లి ‘కూటమి’ సభలో రాజనాథ్‌సింగ్‌
ప్రజాశక్తి – అనకాపల్లి :భూ మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్‌ మాఫియా, లిక్కర్‌ మాఫియాలో ఆరితేరిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని 2024 ఎన్నికల్లో కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం మళ్లా అధికారంలోకి వస్తే జైలుకు పంపిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌ అన్నారు. బిజెపి, టిడిపి, జనసేన కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం అనకాపల్లి పట్టణంలో ర్యాలీ, నెహ్రూచౌక్‌ జంక్షన్‌లో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ.. 2027కి ప్రపంచ దేశాల్లో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌ను నిలపడమే ఎన్‌డిఎ కూటమి లక్ష్యమన్నారు. దేశ స్థూల ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం రూ.58 వేల కోట్లు ఇచ్చి 3,506 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలు చేపట్టిందన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద 21.32 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే వైసిపి ప్రభుత్వం కేవలం రెండున్నర లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించిందని తెలిపారు. జలజీవన్‌ మిషన్‌ కింద కేంద్రం రూ.14 వేల 334 కోట్లు నిధులు ఇస్తే కేవలం రూ.1,051 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగిలిన సొమ్మును వృథా చేసిందన్నారు. సభలో బిజెపి అనకాపల్లి ఎంపి అభ్యర్థి సిఎం రమేష్‌, జనసేన అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, టిడిపి నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.

➡️