వైసిపి విముక్త రాష్ట్రమే లక్ష్యం : యువగళం సభలో టిడిపి, జనసేన అధినేతలు

Dec 20,2023 21:53 #Nara Chandrababu, #speech

పొత్తు చారిత్రక అవసరం : చంద్రబాబు

అంగీకరించాలని అమిత్‌షాను కోరా : పవన్‌ కల్యాణ్‌

యుద్ధం మొదలైంది : లోకేష్‌

అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

భారీగా తరలివచ్చిన రెండు పార్టీల శ్రేణులు

ప్రజాశక్తి-యంత్రాంగం : వైసిపి విముక్త రాష్ట్రమే తమ లక్ష్యమని తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేష్‌ నిర్వహించిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జరిగిన యువగళం-నవశకం బహిరంగ సభ నుండి వారు ఎన్నికల శంఖారావం పూరించారు. పొత్తుపై రాష్ట్ర ప్రజలకు స్పష్టతనిచ్చారు. టిడిపి, జనసేన పొత్తును చారిత్రక అవసరంగా చంద్రబాబునాయుడు అభివర్ణించగా, రాష్ట్ర భవిష్యత్‌ కోసమే పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్‌కల్యాణ్‌ తెలిపారు. ‘బిజెపితో అలయెన్స్‌లో ఉండికూడా టిడిపితో కలిసి పోటీ చేయడానికి ముందుకొచ్చా. రాష్ట్ర పరిస్థితిని బిజెపి నాయకులకు వివరించా. పొత్తు లేకపోతే రాష్ట్రం అంధకారంలో పడుతుందని చెప్పా. పొత్తుకు అంగీకరించాలని అమిత్‌షాను కోరా’ అని ఆయన చెప్పారు. పెద్ద సంఖ్యలో టిడిపి – జనసేన కార్యకర్తలు ఈ సభకు తరలివచ్చారు. వీరినుద్ధేశించి మాట్లాడిన చంద్రబాబు పాదయాత్రలపై దండయాత్రలు చేసిన సంఘటనలు గతంలో ఎన్నడూ లేవని అన్నారు. లోకేష్‌ నిర్వహించిన పాదయాత్రకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులను పెట్టిందని, తప్పుడు కేసులు పెట్టిందని, కార్యకర్తలను జైళ్లకు పంపిందని చెప్పారు. ప్రజల్లో ఉండే బాధలు, ఆక్రోశం, ఆగ్రహం ప్రజాగళం పాదయాత్రలో వ్యక్తమయ్యాయని అన్నారు. వైసిపి నేతల కబ్జాల్లో ఉత్తరాంధ్ర (మొదటి పేజీ తరువాయి)నలిగిపోతోందని అన్నారు. తమ పాలనలో ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ ఇప్పుడు గంజాయికి రాజధానిగా మారిందని చెప్పారు. రుషికొండను బోడిగుండును చేశారని, సిఎం నివాసం కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉండిఉంటే 2020 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేవాళ్లమని, ఇప్పుడు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి అని అన్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని, 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని, అన్నదాత కార్యక్రమం ద్వారా ప్రతిరైతుకు ఆర్థిక సాయం చేస్తామని అన్నారు. అమరావతి, తిరుపతిల్లో సభలు నిర్వహించి టిడిపి, జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పారు. మహిళలకు రక్షణ ఉండాలంటే రాష్ట్రం వైసిపి విము క్తంగా మారాలన్నారు. ఒక్క ఓటు ఆ పార్టీకి పడినా రాష్ట్రానికి శాపంగా మారుతుందని చెప్పారు. ఎన్నికల కురుక్షేత్రంలోవైసిపి ఓడిపోవడం ఖాయమని చెప్పారు.

  • ఎమ్మెల్యేలను కాదు…జగన్‌ను మార్చాలి: పవన్‌ కల్యాణ్‌

ఇటీవల జగన్‌ 80 మంది ఎమ్మెల్యేలను మారుస్తారని వార్తలు వస్తున్నాయని, ‘మార్చాలింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్‌’ను అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 5కోట్ల మంది ప్రజల భవిష్యత్‌కు కోసం అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే టిడిపితో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. జగన్‌ అంటే తనకు వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదని, కానీ ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించి ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఆయన ఉన్నారని అన్నారు. జగన్‌కు ప్రజాస్వామ్యం అనే పదానికి విలువ తెలీదని, ఏదైనా మాట్లాడితే దాడులు చేయించడం, నీచంగా తిట్టించడం మాత్రమే తెలుసని అన్నారు. రాష్ట్రంలో 30వేల మంది ఆడపడచులు అదృశ్యమైతే ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. తాను వారాహి యాత్ర ప్రారంభిస్తే దాడులు, విమర్శలు చేశారని, విశాఖలో కూడా ఎయిర్‌పోర్టు నుంచి పార్టీ కార్యక్రమాలకు వస్తే రానీయకుండా చేశారని అన్నారు. తనలాంటి వాడికే ఇలాంటి ఇబ్బందులు వస్తే సగటు మనిషి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. భవిష్యతులో ఇంకోసారి వైసిపి వస్తే రాష్ట్రంలో ప్రజలు ఉండలేరని, పెట్టుబడులు రావని అన్నారు. యువత భవిష్యత్తును, పెట్టుబడులు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని వైసిపి ప్రభుత్వం మారాలని అన్నారు. వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలనే ఉద్ధేశంతోనే టిడిపితో పొత్తు పెట్టుకున్నట్టు వివరించారు. ఇదే విషయాన్ని బిజెపి నేతలకు కూడా వివరించినట్లు తెలిపారు. ఈపొత్తు సాధ్యమైనంత ఎక్కువ కాలం, రాష్ట్రం నిలదొక్కుకునే వరకు కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు..

  • యుద్ధం మొదలైంది : లోకేష్‌

నవశకం యుద్దం మొదలైందని, తాడేపల్లి కోట తలుపులు బద్దలు కొట్టేంతవరకు ఇది ఆగదని టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేష్‌ అన్నారు. జగన్‌ అహంకారం, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్దం జరుగుతోందనిచెప్పారు. యువగళం సభ ముగింపు కాదు… ఆరంభం అని అన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసి జైలుకు పంపారని చెప్పారు. బాబు విజనరీ అని, జగన్‌ ప్రిజనరీ అని చెప్పారు. జగన్‌ను అరెస్ట్‌ చేసి ఉంటే రోజుకో స్కామ్‌ వెలుగులోకి వచ్చేదన్నారు. మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతాయని, ప్రజాస్వామ్యం పవర్‌ ఏమిటో తెలపాలని చెప్పారు. రాజధానిని చంపి జగన్‌ రాక్షసానందం పొందారని, గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన బాటలో పెడతామని అన్నా రు. ఈ సభలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చె నాయుడు, నేతలు బాలకృష్ణ, రామ్మోహన్‌ నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు.

➡️