ఇసుక అక్రమ మైనింగ్‌ వాస్తవమే 

Feb 15,2024 09:20 #Illegal mining
Illegal sand mining is a reality

హైకోర్టుకు తెలిపిన కేంద్ర అటవీశాఖ

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో ఇసుక అక్రమంగా మైనింగ్‌ జరుగుతోందని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ (ఎంఒఇఎఫ్‌) బుధవారం హైకోర్టుకు నివేదించింది. జిసికెసి ప్రాజెక్ట్స్‌ అండ్‌ వర్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ భారీ మిషన్లతో ఇసుక అక్రమ మైనింగ్‌ చేస్తోందని ఎంఒఇఎఫ్‌, కేంద్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నిర్ధారించింది. వాటి అధికారాలు చెన్నై ఎన్‌జిటి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఇసుక రీచ్‌లను పరిశీలించిందని చెప్పింది. దీనికి సంబంధించిన ఫొటోలు, నకిలీ బిల్‌ పుస్తకాల ఆధారాలను సేకరించిందని తెలిపింది. ఈ మేరకు నివేదికను ఎన్‌జిటికి అందజేస్తామంది. హైకోర్టుకు కూడా అందజేస్తామని ఎంఒఇఎఫ్‌ తరపు అడ్వకేట్‌ జూపూడి యజ్ఞదత్‌ చెప్పారు. దీనిపై హైకోర్టు, ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేయాలని, అదే మాదిరి ఎన్‌జిటికి ఇవ్వనున్న నివేదికను కూడా అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశించింది. ఇసుక రీచ్‌ల నుంచి ఎలా రవాణా చేస్తున్నదీ వివరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని రీచ్‌లలో ఇసుక అక్రమ మైనింగ్‌ నిలువరించాలని అధికారులను ఆదేశించింది.ఇసుక అక్రమ మైనింగ్‌ లేదని, గతంలో తవ్విన ఇసుక నిల్వలనే రవాణా చేస్తున్నామని రాష్టం చెప్పింది. తవ్విన ఇసుక అక్షయపాత్రలో ఉందా? అని చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌ రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ప్రశ్నించింది. అమరావతి మండలం, ముత్తాయపాలెం గ్రామం పరిధిలో జయప్రకాశ్‌ వెంచర్స్‌ సంస్థ ఇసకను అక్రమంగా తవ్వేస్తున్నారంటూ జివిఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.వైఫల్యం చెందితే అధికారులపై చర్యలుఅక్రమ మైనింగ్‌ కట్టడిలో ప్రభుత్వం వైఫల్యం చెందితే అందుకు అధికారులపై చర్యలు ఉంటాయని హైకోర్టు హెచ్చరించింది. చిత్తూరు జిల్లా, అనంతపురం గ్రామ పంచాయతీలోని నీవా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై దాఖలైన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ విచారణ జరిపింది. ప్రతివాదులైన రెవెన్యూ, మైనింగ్‌శాఖ అధికారులు అక్రమ మైనింగ్‌ కట్టడికి చర్యలు తీసుకోవాలంది. ఇతర ప్రతివాదులైన జయప్రకాశ్‌ వెంచర్స్‌, ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. విచారణను మార్చి 13కు వాయిదా వేసింది. గ్రామ సర్పంచ్‌ స్వామినాథన్‌ దాఖలు చేసిన పిల్‌పై కౌంటర్‌ వేయాలని ఆదేశించింది. అక్రమ మైనింగ్‌ నివారణ చర్యలు తీసుకుని వాటిని వివరించాలంది.

➡️