వంద కోట్లు దాటిన వస్త్ర వ్యాపారం

small shops market damage by corporate
  • వెల వెల బోతున్న బాలాజీ మార్కెట్
    కిక్కిరిసిన జనంతో కార్పొరేట్ వస్త్ర షాపులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఏడాదిలో మొదటి రైతు పండగ, ప్రతి ఒక్కరూ ఇంటిల్లిపాది చేసుకునే ప్రధాన పండగ అయిన సంక్రాంతి పండుగ కావడంతో నగరంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు బట్టలు షాపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటే, ఇదే ప్రధాన జీవనాధారంగా ఉండి అతిపెద్ద వస్త్ర మార్కెట్ కలిగిన స్థానిక వ్యాపారులు, బాలాజీ మార్కెట్ వంటి షాపులు యజమానులు వ్యాపారాలు తగ్గి ఎవరోస్తారనే ఎదురు చూడాల్సిన పరిస్తితి నెలకొంది. నేటి నుంచి భోగితో పండగ ప్రారంభం కావడంతో ఇప్పటి వరకు వంద కోట్లు పైగా నగరంలో వస్త్ర వ్యాపారం జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో నూతన వస్త్రాలు కొనుగోలు చేయాలంటే విజయనగరం, శ్రీకాకుళం, ఒరిస్సా ప్రాంతాల వారికి గుర్తుకు వచ్చేది విజయనగరం పట్టణంలో ఉన్న ఉల్లివీది, బాలాజీ మార్కెట్ ప్రాంతాలు. వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ది చెందిన ప్రాంతాలు నేడు కార్పొరేట్ కంపెనీలు రిలయన్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డీ మార్ట్,సి ఎం ఆర్ తో పాటు రింగ్ రోడ్డులో బ్రాండెడ్ షాపులు అధికంగా ఉండటంతో వ్యాపారం స్థానికులకు తగ్గిపోయింది. వంద కోట్లు వ్యాపారంలో పదులు సంఖ్యలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు షాపులకు 50 శాతం వ్యాపారం జరగగా, వందల సంఖ్యలో స్థానిక వ్యాపార సంస్థలకు ఉన్న 50 శాతం వ్యాపారం అయినట్లు తెలుస్తుంది. కార్పొరేట్ కంపెనీలు బట్టలు షాపులు దెబ్బకు స్థానిక వ్యాపారులు బెంబేలు ఎత్తిపోతున్నారు. ఇది ఏమైనా అన్ని వర్గాలు ప్రజలకు ప్రధాన పండగ కావడంతో నగరంలో చిన్నా, పెద్ద షాపుల్లో శుక్రవారం నాటికి 100 కోట్లు పైగా వస్త్ర వ్యాపారం జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. శని, ఆదివారాలు రెండు రోజుల్లో కలిపి సుమారుగా 200 కొట్లుకు దగ్గరకు వ్యాపారం జరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు.

➡️