టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం

Jan 2,2024 21:35 #press meet, #ycp mla

– డబ్బులిస్తే ఐ-ప్యాక్‌ వాళ్లు సర్వే ఫలితాలు మారుస్తారు

– పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్‌ బాబు

ప్రజాశక్తి- పూతలపట్టు (చిత్తూరు జిల్లా) టికెట్ల విషయంలో దళితులకు వైసిపి అన్యాయం చేస్తోందని పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్‌ బాబు ఆరోపించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఆయన స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టికెట్ల కేటాయింపుపై తన ఆవేదనను తెలిపారు. గత అయిదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే తాను నడుచుకున్నానని, ఇప్పుడు తనపై వ్యతిరేకత ఉంటే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న ఈ ఐదేళ్ళలో ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదన్నారు. ఇప్పుడు ఐ-ప్యాక్‌ సర్వేలో తనకు అనుకూలంగా లేదని, ఈ దఫా పూతలపట్టు టికెట్‌ ఆశించవద్దని సిఎం జగన్‌ చెప్పడం తగదన్నారు. డబ్బులు ఇస్తే ఐ-ఫ్యాక్‌ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారని, టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్‌ ఇవ్వకపోయినా పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తానని, నియోజకవర్గంలో తనను నమ్ముకున్న వారికి ఎప్పుడూ తోడుగా ఉంటానని తెలిపారు.

➡️