నూజివీడు మామిడికి అంతర్జాతీయంగా డిమాండ్

Apr 24,2024 09:56

ఏటేటా వేసవిలో లభించే పండ్లలో మామిడే అగ్రస్థానం. పలు రకాల మామిడి కాయలు, పండ్లు తింటే ఎంతో మధురంగా ఉంటాయి. రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తర్వాత ఏలూరు, ఎన్‌టిఆర్‌ జిల్లా పరిధిలోనే మామిడి తోటల్లో ప్రస్తుతం మామిడి కాయలు కోతకు వచ్చాయి. నూజివీడు పేరు ప్రపంచ దేశాల్లో వ్యాపించడానికి మామిడి కారణంగా చెప్పక తప్పదు. నూజివీడు మెట్ట ప్రాంతంలో 60 శాతం మంది రైతులు మామిడి పంటను ప్రధాన సాగుగా చేపడుతున్నారు. రాష్ట్రంలో ఏటేటా 30 నుంచి 40 లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తుందని అంచనా. నూజివీడు ప్రాంతంలో పండే చిన్న, పెద్ద రసాలతో పాటు హిమాయతీలకు జాతీయ అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉంది. నూజివీడు ప్రాంతంలో రసాలతో పాటు బంగినపల్లి, ముంత మామిడి, తోతాపురి ఇతర జాతుల కాయలు ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చేశాయి. చాట్రాయి, విస్సన్నపేట, రెడ్డిగూడెం, తిరువూరు, గంపలగూడెం, నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి, బాపులపాడు, మైలవరం తదితర మండలాల నుంచి మార్కెట్లోకి మామిడి ఎగుమతి అవుతోంది. మార్కెట్లోకి పెద్దఎత్తున మామిడి పండ్లు వచ్చాయి. నోరూరించే మామిడిపండ్లు తినని వారు ఉండరంటే ఆశ్చర్యం కలుగకమానదు. చిన్న రసాలు డజను రూ.400 నుంచి రూ.500, పెద్ద రసాలు రూ.500 నుంచి రూ.700, బంగినపల్లి పండ్లు డజను రూ.300 నుంచి రూ.400 ధరల్లో లభ్యమవుతున్నాయి. ముంత మామిడి కాయ రూ.50 నుంచి రూ.70, సువర్ణరేఖ రూ.25 నుంచి రూ.40 వరకూ సైజులను బట్టి ధరలు ఉన్నాయి. నూజివీడు రసాలకు విదేశాల్లోనూ డిమాండ్‌ నూజివీడులో పండే చిన్న, పెద్ద రసాలకు దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాల్లోనూ మంచి డిమాండ్‌ ఉంది. ఏప్రిల్‌ నుండి జూన్‌ మాసాంతం వరకు మామిడి కాయలు అందుబాటులో ఉంటాయి. నూజివీడు ప్రాంతంలో రసాలతో పాటు బంగినపల్లి, ముంత మామిడి ఎక్కువగా లభిస్తుంటాయి. నూజివీడు, సమీపంలోని చాట్రాయి, విస్సన్నపేట, రెడ్డిగూడెం, తిరువూరు, గంపలగూడెం, నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి, బాపులపాడు, మైలవరం తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున మామిడితోటలు విస్తరించి ఉన్నాయి. నూజివీడు పట్టణ పరిసర ప్రాంతాల్లో మ్యాంగో పల్ప్‌, మ్యాంగో జ్యూస్‌ ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి. అంతర్జాతీయంగా నూజివీడు మామిడికి డిమాండ్‌ ఉండడంతో ఏటేటా 40వేల టన్నుల మామిడి ఢిల్లీ, నాగ్‌పూర్‌, చెన్నై తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. మామిడి ఎగుమతుల ద్వారా రైల్వే శాఖకు ప్రతి యేటా కోట్ల రూపాయల్లో రవాణా ఛార్జీల రూపంలో ఆదాయం సమకూరుతుంది.కెనడా, అమెరికాకు నూజివీడు మామిడి ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాయపాలెం గ్రామం నుంచి మామిడి పండ్లు కెనడా, అమెరికాకు ఎగుమతికానున్నాయి. రైతు ఎన్‌బివి రాఘవరావు తన ఎనిమిది ఎకరాల్లో బంగినపల్లి, చిన్నరసం, చెరుకు రసం రకాలను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేశారు. ఈ రైతు పండించిన మామిడికాయలు నాణ్యతగా ఉండటంతో ఈనెల 16న 1.2 టన్నుల మామిడి పండ్లను కెనడాకు పంపించారు. ఈనెల 25న అమెరికాకు మళ్లీ ఎగుమతి చేయబోతున్నారు. కృష్ణాజిల్లా అయ్యంకిలోని కోసూరి బాలాజీ ఆగ్రో ఫుడ్‌ ప్రయివేటు లిమిటెడ్‌లో ప్యాకహేౌస్‌లో మామిడికాయలు గ్రేడింగ్‌ చేసి ప్యాకింగ్‌ చేస్తున్నారు. గతేడాది ఈ ప్యాక్‌ హౌస్‌ నుంచి 125 టన్నుల మామిడికాయలు యుకె, కెనడా, సౌదీ అరేబియా, యుఎస్‌ఎ, దుబారుకి ఎగుమతి చేశారు. ఈ ఏడాది 300 టన్నులు మామిడికాయలు నూజివీడు ప్రాంతం నుండి ఎగుమతి చేయబోతున్నాయి. ఈ ప్యాక్‌ హౌస్లో గామా ఇరాడియేషన్‌ జరిపించి, బెంగళూరులోని ఇన్నోవా ప్యాక్‌ హౌస్‌కి పంపిస్తారు. అక్కడి నుంచి బెంగుళూరు ఎయిర్‌పోర్టు ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.-యడవల్లి శ్రీనివాసరావు,నూజివీడు

➡️