TDP కార్యాలయంపై దాడికేసు విచారణ

Jul 1,2024 23:08 #attack, #police case, #TDP Govt
  • సిసి కెమెరాలను పరిశీలించిన పోలీసులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన ఘటనలో పోలీసులు ఇప్పుడు విచారణ ప్రారంభించారు. 2021 అక్టోబరు 19న వైసిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వెళ్లి కార్యాలయం ప్రధాన గేట్లను ధ్వంసం చేసి కార్యాలయంలోకి ప్రవేశించి అడ్డొచ్చిన వారిపై దాడి చేసిన ఘటనపై టిడిపి వెంటనే ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించని పోలీస్‌శాఖ ప్రభుత్వం మారగానే ఇప్పుడు విచారణను మొదలు పెట్టడం చర్చనీయాంశమైంది. నాటి సిఎం జగన్‌ను టిడిపి నేత పట్టాభి వ్యక్తిగతంగా విమర్శలు చేశారని వైసిపి శ్రేణులు ఈ దాడులకు పాల్పడ్డట్లు విమర్శలు వున్నాయి. టిడిపి కార్యాలయం ఆవరణలో వున్న కార్లను, కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతోపాటు పట్టాభి ఇంటిపై కూడా దాడి చేశారు. పట్టాభి నివాసంలో విలువైన వస్తువులు, ఫర్నీచర్‌ ధ్వంసం చేసి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ కేసులు అప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టించినా పోలీసులు విచారణ జరపకుండా కేసును అటకెక్కించారు. సోమవారం పోలీసులు టిడిపి కార్యాలయానికి వెళ్లి అక్కడ వున్న సిబ్బందిని దాడి జరిగిన తీరుపై విచారించారు. అలాగే కార్యాలయం లోపల, బయట వున్న అన్ని సిసి టివి ఫుటేజ్‌లను సేకరించారు. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. వైసిపి నేతలు దేవినేని అవినాష్‌, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులే దాడులకు తెగపడ్డారంటూ టిడిపి శ్రేణులు చెబుతున్నాయి.

➡️