ఐఆర్‌, పిఆర్‌సి ఊసే లేదు : యథాతథంగా ఉద్యమ కార్యాచరణ

Feb 13,2024 08:40 #activity, #IR, #movement, #PRC
  • పెదవి విరుస్తున్న ఉద్యోగులు
  • యథాతథంగా ఉద్యమ కార్యాచరణ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఉద్యోగుల సమస్యలపై సోమవారం సాయంత్రం మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు ఐఆర్‌, పిఆర్‌సి వంటి కీలకాంశాల ఊసు లేకుండా సాగాయి. దీంతో ఉద్యోగసంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఉద్యమ కార్యాచరణలో ఎటువంటి మార్పు లేదని ప్రకటించాయి. సచివాలయంలో సోమవారం సాయంత్రం మంత్రి వర్గ ఉప సంఘం ఉద్యోగ సంఘాలతో పెండింగ్‌ అంశాలు, బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై భేటీ నిర్వహించింది. ఈ చర్చల్లో 12వ పిఆర్‌సి విధి విధానాల గురించి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోగా, కనీసం ఐఆర్‌ 30శాతమైనా ప్రకటించకపోతుందా అని అని ఆశించిన ఉద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు కుమ్మరించింది. చర్చల్లో మార్చి 31లోగా ఉద్యోగులు బకాయిల్లో కొంత మేర చెల్లిస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. ఆర్ధికశాఖ కార్యదర్శి సత్యనారాయణ బకాయిలు జిపిఎఫ్‌, జడ్‌పిపిఎఫ్‌ కలిపి రూ.946కోట్లు, ఇందులో క్లాస్‌ ఫోర్‌ ఉద్యోగులకు సంబంధించిన రూ.67కోట్లు ఉన్నట్లు సమావేశంలో దీనిలో పిబ్రవరి నెలాఖరుకు రూ.60కోట్లు బకాయిలు చెల్లిస్తామని, మిగిలిన అన్ని బకాయిలు మార్చి 31లోగా చెల్లిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్లో ఎపి జిఎల్‌ఐ రూ.516కోట్లు, టిఎ, డిఎలు కలిపి రూ.275కోట్లు, మెడికల్‌ బిల్లులు రూ.118కోట్లు, సిపిఎస్‌ మ్యాచింగ్‌ గ్రాంట్‌ బకాయిలు రూ.2,800కోట్లు, సిపిఎస్‌ 90శాతం డిఎ బకాయిలు రూ.2,100కోట్లు, సరెండర్‌ లీవ్‌ బకాయిలు రూ.2250కోట్లు, పెన్షనర్స్‌ బెనిఫిట్స్‌ రూ.280కోట్లు, డిఎ అరియర్స్‌ రూ.4,500కోట్లు, 11వ పిఆర్‌సి బకాయిలు రూ.7,800కోట్లు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ భేటీలో ప్రభుత్వం తరపున రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి, సిఎస్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, ఆర్దికశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధికశాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ, సర్వీసెస్‌ శాఖ కార్యదర్శిభాస్కర్‌, జిఎడి అదనపు కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసులు పాల్గొనగా, మునిసిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఆర్దిక శాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎపి ఎస్‌టియు అధ్యక్షులు సాయి శ్రీనివాస్‌, పిఆర్‌టియు అధ్యక్షులు యు.కృష్ణయ్య, ఎపిటిఎఫ్‌ అధ్యక్షులు జి.హృదయరాజు, ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కెఆర్‌ సూర్యనారాయణ, ఎపి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఎస్‌ బాలాజీ, ఎపి ప్రభుత్వ డ్రైవర్ల సెంట్రల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సంసాని, ఆల్‌ ఎపి ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సెంట్రల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చంద్రశేఖర్‌, పాల్గొన్నారు.

త్వరలో 12వ పిఆర్‌సి : మంత్రి బొత్స

                చర్చల సారాంశాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడిస్తూ పిఆర్‌సిని త్వరిత గతిన ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇప్పటికే పిఆర్‌సి కమిషన్‌ వేశామన్నారు. అయితే, ఎప్పుడు పిఆర్‌సి వేస్తారన్న విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. ఉద్యోగ సంఘాలు మధ్యంతర భృతిని కోరాయని ఆ అంశాన్ని పరిశీలిస్తామన్నారు.

ప్రభుత్వం దాట వేత ధోరణి: యుటిఎఫ్‌

                  ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దాట వేత ధోరణి అవలంభించిందని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తాము ప్రభుత్వం ముందు ఉచ్చిన ప్రతిపాదనలను వివరించారు. ప్రభుత్వం ఏ సమస్య పరిష్కారానికి ముందుకు రాని నేపథ్యంలో ఇప్పటికే ఎపిజెఎసి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ యధావిధిగా కొనసాగుతుందన్నారు. సిపిఎస్‌ , జిపిఎస్‌ రద్దుతో పాటు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ మొమో 57పరిధిలోకి వచ్చే వారికి పాత పెన్షన్‌ అమలు చేయాలని, సరెండర్‌ లీవ్‌, పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ, డిఎ, 11వ పిఆర్‌సి బకాయిలు, సిపిఎస్‌ వారికి 90శాతం డిఎ బకాయిలు, మెడికల్‌ బిల్స్‌, పెన్షనర్లకు తగ్గించిన అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ సవరించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు మంత్రి వర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లారు. వీటితో పాటు 12వ పిఆర్‌సికి సంబంధించి 30శాతం ఐఆర్‌ ప్రకటించాలని, స్ధానిక సంస్థల్లో పనిచేస్తున్న వారికి కారుణ్య నియామకాలు చేపట్టాలని, కెజిబివిలకు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ ఇవ్వాలని, అంతర్‌ జిల్లా బదిలీలు జరపడంతో పాటు ఎంటిఎస్‌ ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేయాలని, ఎఎఎస్‌ అమల్లో ఉన్న ఇబ్బందులను సవరించాలని, హైస్కూల్‌ ప్లస్‌ వారికి ఇవ్వాల్సిన అడిషనల్‌ ఇంక్రిమెంట్‌ అమలు చేయాలని, ఎపిజిఎల్‌ఐ లావాదేవీలను పునరుద్దరించాలని, ఆన్‌లైన్‌ ఆలస్యమైతే ఫిజికల్‌గానైనా అనుమతించాలని యుటిఎఫ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

యధాతథంగా ఉద్యమ కార్యాచరణ : ఎపి ఎన్‌జిఓ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు

                  జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం నిరూత్సహపరిచిందని ఎపి ఎన్‌జిఓ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎపి జెఎసి ప్రకటించిన 14నుంచి 27వరకు షెడ్యూల్‌ మథ్యంతర భృతి విషయంలో ప్రభుత్వం స్పందించలేదని,పిఆర్‌సి కమిషన్‌ వేసినా ఆయన కమిషన్‌ వేసినా ఆయన కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేదన్నారు.

బకాయిలు తెలిశాయి : బొప్పరాజు వెంకటేశ్వర్లు

                         ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో కొత్త దనం ఏమీ లేదని, ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత బకాయి పడిందో ఈ సమావేశం ద్వారా తెలుసుకోగలిగామని ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మార్చి నెలాఖరుకు కొన్ని బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని, రూ.600కోట్లు ఎపిజిఎల్‌ఐ బకాయిలు ఉన్నాయన్నారు. సిపిఎస్‌ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌ కూడా రూ.2500కోట్ల మేర చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం హామీనిచ్చిందన్నారు. హత్యకు గురైన తహశీల్దార్‌ రమణయ్య కుటుంబానికి రూ.50లక్షల పరిహారంతో పాటు కారుణ్య నియామకం కింద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

డిఎ, మధ్యంతర భృతిపై చర్చించాం : సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటరామిరెడ్డి

డిఎ, మధ్యంతర భృతిపైనా సమావేశంలో చర్చించామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. రూ.5,600కోట్ల మేర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు మార్చి 31నాటికి చెల్లిస్తామని ఫ్రభుత్వం వెల్లడించిందన్నారు. సిపిఎస్‌ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌ రూ.2,400కోట్లు పెండింగ్‌లో ఉందని మార్చి 31నాటికి జమచేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు.

➡️