సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేశారు- నాదెండ్ల మనోహర్‌

Dec 11,2023 08:17 #Nadendla Manohar, #speech

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసిందనిజనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నారు. శ్రీకాకుళంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనలో పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఇసుక, మద్యం, విద్య, పశుసంవర్థక శాఖ ఇలా ఎందులో చూసినా రూ.వేల కోట్ల అవినీతి బయటపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి బంధువు, మాజీ మంత్రి నెల్లూరు జిల్లాలో పెద్దఎత్తున భూముల లావాదేవీల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్నివిధాలుగా దివాళా తీయించారని ఆరోపించారు. వీటన్నింటికీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సంక్షేమం పేరిట ప్రజలపై భారాలు మోపుతున్నారని తెలిపారు. నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, వచ్చే ఎన్నికల్లో వైసిపికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.

➡️