హేళన చేస్తూ నిందలు మోపడం తగునా?

Apr 26,2024 00:25 #letter, #sowbhagyamma

– సిఎం జగన్‌కు వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ
ప్రజాశక్తి – పులివెందుల టౌన్‌ :”మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిపై, నీ చెల్లెళ్లు షర్మిల, సునీతపై నిందలు మోపడం నీకు తగునా” అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివేకా భార్య వైఎస్‌ సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న వారిపై నిందలు వేస్తూ హేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్యకు కారణమైన వారికి మళ్లీ ఎంపి అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. చెప్పలేని విధంగా వ్యక్తిగత హననం చేయించడం తగునాఅని ప్రశ్నించారు. ”నిన్ను సిఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నపై నీ సొంత మీడియా, పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ సొంత చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపుతున్నారు. కొంతమంది దాడులకూ తెగబడే స్థాయికి దిగజారుతున్నా నీకు పట్టడం లేదా? అని ప్రశ్నించారు. ”సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలనూ టార్గెట్‌ చేస్తుంటే నిమ్మకునీరెత్తినట్లు ఉండటమేంటి?. కుటుంబ సభ్యునిగా కాకపోయినా ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? ఇంకా బాధించే అంశం హత్యకు కారకులైన వారికి మళ్లీ ఎంపిగా అవకాశం కల్పించడం. ఇది సమంజసమా? ఇలాంటి దుశ్చర్యలు ఏ మాత్రం మంచిది కాదు. హత్యకు కారకుడైన నిందితుడు నామినేషన్‌ దాఖలు చేశాడు. చివరి ప్రయత్నంగా ప్రార్థిస్తున్నా. రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడాలని వేడుకుంటున్నా” అంటూ లేఖలో పేర్కొన్నారు.

➡️