హమ్మయ్య…వాన కురిసింది

May 9,2024 12:32 #VARSHAM
  • సేద తీరిన ప్రజానీకం
    ప్రజాశక్తి-వెబ్‌డెస్క్
    రాష్ట్ర వ్యాప్తంగా గత మూడురోజులుగా పలు ప్రాంతాల్లో అడపా దడపా చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు, భారీ వర్షాలు సైతం కురిశాయి. కృష్ణా, ఎన్‌టిఆర్‌, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి వర్షం కురవటం మొదలైంది. మొదట చిరు జల్లులతో మొదలై ఆపై భారీ వర్షం కురవటంతో ప్రజానీకం సేద తీరారు. గత నెలాన్నర రోజులుగా అనూహ్యంగా కాస్తున్న ఎండలతో ప్రజానీకం బెంబేలెత్తిపోతున్న విషయం తెలిసిందే. మంగళవారం చిరుజల్లులు కురవగా, గురువారం కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. పెడన, బంటుమిల్లి, కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, కుంచనపల్లి, ఉండవల్లి, అమరావతి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఏలూరు జిల్లా నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం కురిసింది. తిరువూరు, విస్సన్నపేట, ఎ.కొండూరు, మైలవరం, చాట్రాయి, గంపలగూడెం ప్రాంతాల్లో మంగళవారం ఈదురుగాలులతో కురిసిన వర్షానికి మామిడితోటల్లోని కాయలు చాలా వరకూ రాలిపోయాయి. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణం చుట్టూ పరిసర గ్రామాల్లో గురువారం తెల్లవారుజామున చిరుజల్లులు కురిశాయి. పాడేరు ఏజెన్సీలో మే నెల ఆరంభం నుంచి భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మండుటెండలతోపాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండ తీవ్రతకు రోజు ఇటీవల 33 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఈ తీవ్రమైన మండుటెండల్లో కూడా పాడేరు మన్యంలో రోజు పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు మండలాల్లో కురుస్తున్న వానలు 30 మిల్లీమీటర్ల వరకు నమోదు అవుతున్నాయి. సాయంత్రం పూట పడే వానలు రాత్రిపూట కురిసే మంచు తో మన్యంలో నెలకొన్న ఈ భిన్న వాతావరణం, మన్యవాసులను ఆహ్లాదపరుస్తూ మండుటెండలనుంచి మై మరిపిస్తోంది. ఆకాశంలో విహరిస్తూ అలసి సొలసి పాడేరు సమీపంలోని పర్వతాల కిందకు నేలకు ఒదిగి సేద తీరుతూ విశ్రమిస్తున్న ” పాసింగ్‌ క్లౌడ్స్‌” ఇప్పటికే రాష్ట్రం నలుమూలల ప్రజలను ఆకర్షించి ఆకట్టుకుంటున్నాయి. గత రెండేళ్లుగా ఈ ప్రాంతం ”వంజంగి హిల్స్‌” పేరుతో పర్యాటక కేంద్రంగా మారింది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు భువికేగిన కైలాసగిరిగా ఈ ప్రాంతాన్ని అభివర్ణిస్తున్నారు. వేలాది ఎకరాల్లో విస్తరించిన కాఫీ తోటలుతో వీటికి నీడనిచ్చే తోటలు విస్తరణతో పాడేరు ఏజెన్సీ ఏడాది పొడుగునా మూడు కాలాలను రోజు చవిచూసే ఒక శీతల కేంద్రంగా భిన్న వాతావరణానికి నెలవుగా మారింది.
➡️