వైఎస్‌ఆర్‌ కుటుంబం చీలడానికి జగనే కారణం – పిసిసి చీఫ్‌ వైఎస్‌ షర్మిల

Jan 26,2024 07:44 #Kakinada, #ys sharmila
Congress Election Committee headed by Sharmila

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి:’రాష్ట్రాన్ని, నా కుటుంబాన్ని కాంగ్రెస్‌ చీల్చిందంటూ జగనన్న ఆరోపణ చేస్తున్నారు. నిన్న జరిగిన ఇండియా టుడే కార్యక్రమంలో అదే పనిగా అనేక ఆరోపణలు చేశారు. వాస్తవానికి మా కుటుంబం చీలడానికి కారణం జగనన్నే. దీనికి సాక్ష్యం నా కుటుంబం, రాజశేఖర్‌రెడ్డి భార్య నా తల్లి విజయమ్మ’ అని పిసిసి చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. కాకినాడ సూర్య కళామందిరంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసిపి కష్టాల్లో ఉందంటే పిల్లల్నీ, కుటుంబాన్ని వదులుకొని పాదయాత్ర చేశాననని, జగనన్న ఏం కావాలంటే అది వెంటనే చేశానని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిగా మారిపోయారని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పాలనపై ప్రజలు ఆశ పడితే సిఎం జగన్‌ నేతృత్వంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. తన తండ్రి, మాజీ సిఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశించిన విధంగా వైసిపితో సంక్షేమం అందుతుందని తాను ఆశించానని, దానికి విరుద్ధంగా రాక్షస పాలనను జగన్‌ చేస్తున్నారని విమర్శించారు. బిజెపికి తొత్తులుగా టిడిపి, వైసిపి, జనసేన మారాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి చంద్రబాబు, జగనే కారణమని విమర్శించారు. రాజశేఖర్‌రెడ్డి కలల ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే 20 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయ్యేవన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో నిర్మాణ వ్యయాన్ని రూ.50 వేల కోట్లకు పెంచిన ఘనత జగన్‌దే అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విభజన హామీలు వంటి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ఎంఎం పల్లంరాజు, జెడి శీలం, సుంకర పద్మశ్రీ, గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్‌, పి.రఘువీరారెడ్డి పాల్గొన్నారు.

➡️