పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచాలి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో పాఠశాలలు పున:ప్రారంభమయ్యేనాటికి పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, యూనిఫామ్‌తోపాటు బ్యాగులు వంటివన్నీ విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. 2024-25 విద్యా సంవత్సర సన్నాహాక ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు, ఎన్ని బ్యాగులు సమకూర్చారు? ఇంకా ఎన్ని సమకూర్చాలి? తదితరవాటిపై ఆయన సమీక్షించారు.
విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ.. జూన్‌ 12న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని, జూన్‌ 10లోగా విద్యార్థులకు పాఠ్య, నోట్‌ పుస్తకాలతోపాటు యూనిఫామ్‌ పంపిణీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే 82 శాతం పుస్తకాల ప్రచురణ పూర్తై, మండల స్టాక్‌ పాయింట్లకు చేరాయని అన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో 1 నుంచి 10 వరకూ బైలింగ్యూవల్‌ పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందిస్తామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 70 లక్షల 42 వేల 12 మంది విద్యార్థులను ఎన్రోల్‌ చేయగా.. వారిలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 36.54 లక్షల మంది ఎన్రోల్‌ అయ్యారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కమిషనరు కె భాస్కర్‌, బిఆర్‌ అంబేద్కర్‌, ఎపిఎస్‌డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️