పోలాలకు సాగునీరివ్వాలని రైతుల రాస్తారోకో

Dec 20,2023 21:00 #jc prabhakar reddy, #speech

ప్రజాశక్తి-పెద్దవడుగూరు (అనంతపురం):పొలాలకు సాగునీరివ్వాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు 44వ జాతీయ రహదారిపై రైతులు బుధవారం పెద్ద ఎత్తున రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఎండిపోయిన మిరప మొక్కలను చేతబట్టుకుని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జెసి ప్రభాకర్‌రెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జెసి.అస్మిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. దాదాపు గంటపాటు రాస్తారోకో చేపట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ధర్నానుద్ధేశించి జెసి.ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. ఇసుక దోపిడీని కప్పిపుచ్చేందుకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంపిఆర్‌ ప్రాజెక్టు నుంచి సాగునీటిని పొలాలకు ఇవ్వకుండా వృథాగా వదిలేసి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. వైసిసి నేతలు పెన్నా నదిలో సాగించిన ఇసుక దోపిడీ వల్ల ఏర్పడిన గుంతలు కన్పించకుండా ఉండేందుకు నీటిని అనవసరంగా వదిలేశారని ఆరోపించారు. అలా చేయడం వల్ల ప్రస్తుతం రైతులకు సాగునీరు లేకుండా పోయిందని తెలిపారు. ఓ వైపు వర్షాల్లేక, మరో వైపు కాలువల ద్వారా సాగు నీరు రాక రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. దీనికంతటికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇసుక దోపిడీనే కారణం ఆరోపించారు. పంటలకు సాగునీరిచ్చేంత వరకు రాస్తారోకో విరమించేది లేదంటూ రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసులు అక్కడికి చేరుకుని రాస్తారోకో విరమించాలని కోరినా వినలేదు. అనంతరం ప్రభాకర్‌రెడ్డి కలెక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించారు. రైతులకు సాగునీటిని అందించే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

 

➡️