లౌకిక తత్వాన్ని కాపాడమే లక్ష్యం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌ వెస్లీ

రంగారెడ్డి : ప్రజా సమస్యలపై పోట్లాడేందుకు పార్లమెంటులో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఎంతో అవసరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌ వెస్లీ అన్నారు. దేశాన్ని మతోన్మాద ప్రమాదం నుంచి ఎదుర్కొని లౌకిక తత్వాన్ని కాపాడుతామన్నారు. సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం నియోజకవర్గం స్థాయి సమావేశం ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో శనివారం నిర్వహించారు. సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి జాంహంగీర్‌ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమ్యూనిస్టుల ప్రాబల్యం అత్యధికంగా ఉందన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో నకిరేకల్‌, భువనగిరి, జనగాం, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, మునుగోడు నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులు అప్రతియతంగా ప్రాతినిధ్యం వహించారని చెప్పారు. ఆయా నియోజకవర్గాల సమాఖ్య అభివఅద్ధిలో ముఖ్య భూమిక పోషించారని చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం కలిగిన ఈ ప్రాంతంలో నేటికీ ఆ పోరాట వారసత్వం కలిగి ఉందన్నారు. భూ పోరాటాలతో పాటు తాగునీరు, సాగు నీరు కోసం సీపీఐఎం ఆధ్వర్యంలో అవిశ్రాంతర పోరాటాలు నిర్వహించి సాధించామన్నారు. పాదయాత్రలు నిర్వహించే వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదించామన్నారు. భువనగిరి పార్లమెంటు సరిహద్దులు ఇతర పార్టీ అభ్యర్థులకు తెలుసా అని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంలోని ఏనాడైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు పోరాటాలు చేశారా అని నిలదీశారు. కార్మికులు, కర్షకులు, అసంఘటితరంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు పోరాటం నిర్వహించారని, నేటికీ నిర్వహిస్తూనే ఉన్నామని చెప్పారు. కేంద్రంలోని ప్రభుత్వానికి నిలదీసి వాటి పరిష్కారం కోసం ఉద్యమించే తత్వం కేవలం కమ్యూనిస్టులకు మాత్రమే ఉందన్నారు.
గత యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాల బలం ఉన్న కారణంగానే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సాధించుకున్నామన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని సాధించుకున్నామన్నారు. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ఈ చట్టాలను తుంగలో తొక్కుతోందన్నారు. మతోన్మాదం పెరిగిపోతుందన్నారు. తెగలు, కులాల మధ్య వైషమ్యాలు రెచ్చ గొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా సరైన పంధలో పోరాటాలు నిర్వహించడం లేదని విమర్శించారు. లౌకిక విలువలను కాపాడడంలో విఫలమైనదన్నారు. మోడీ ప్రభుత్వం మనువాదాన్ని తెచ్చేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కనీస వేతన చట్టాలతో పాటు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పేదల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయడంతో పాటు మతోన్మాదాన్ని ఎదుర్కొని లౌకిక వాదాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఆ ప్రయత్నం సీపీఐ(ఎం) మాత్రమే చేస్తుందని చెప్పారు. భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి ఎండి జాంహంగీర్‌ మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గంలో కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించి అభివృద్ధి చేశారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులను గెలిపించాలన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వివక్ష చూపిందన్నారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. అభ్యుదయవాదులకు అవకాశవాదులకు మధ్య ఈ పోటీ కొనసాగుతుందని చెప్పారు. డబ్బులు వెదజల్లి గెలవాలని చూస్తున్న పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీ చరిత్ర ఏంటో ఈ ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసన్నారు. భవిష్యత్తులో స్థానిక సమస్యలు ఏజెండాగా పనిచేస్తామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగిస్తారని ప్రశ్నించారు. సరైన ప్రణాళిక లేకపోవడం వలన అనేక ప్రాజెక్టులు వెనుకబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. తెలంగాణలోని ఏయిమ్స్‌ ఇచ్చిన కనీస వసతులు కల్పించడం లేదని మండిపడ్డారు. 44 డిపార్ట్మెంట్లు ఉంటే కేవలం 20 డిపార్ట్మెంట్లు మాత్రమే పని చేస్తున్నాయని చెప్పారు. మూసి ప్రక్షాళనతో పాటు ముందు మూషిని శుద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. కాలుష్య కారకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. భువనగిరి పార్లమెంటు అభివృద్ధి కమ్యూనిస్టులకే సాధ్యమవుతుందన్నారు. ఆ పోరాట వారసత్వం కలిగిన కమ్యూనిస్టు అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఆదరించి, అభిమానించే గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎం జిల్లా కార్యదర్శి కడిగల్ల భాస్కర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీరామ్‌ నాయక్‌, జగదీష్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యాదయ్య, సామెల్‌, జగదీష్‌, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్‌ జంగయ్య, శ్యాంసుందర్‌, ఆలంపల్లి నరసింహ, ఈ నరసింహ, కే జగన్‌, అంజయ్య, కిషన్‌ శ్యాంసుందర్‌ శ్రీనివాసరెడ్డి మండల మండల కార్యదర్శులు తదితరులు ఉన్నారు.

➡️