దేశం కోసం, రాష్ట్రం కోసం ఉమ్మడిపోరు : సిహెచ్‌.బాబూరావు

  • ప్రజల తరుపున పోరాడే వ్యక్తినే అసెంబ్లీకి పంపించాలి 
  • నాల్గోవ రోజు ‘సిపిఎం జన శంఖారావం’ పాదయాత్ర

ప్రజాశక్తి -అజిత్‌ సింగ్‌ నగర్‌ : ప్రజల తరుపున పోరాడే వ్యక్తినే అసెంబ్లీకి పంపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబురావు పిలుపునిచ్చారు. విజయవాడ సెంట్రల్‌లో కొనసాగుతున్న ‘సిపిఎం జన శంఖారావం’ పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిహెచ్‌ బాబురావు మాట్లాడుతూ.. మోడి, కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు ద్రోహం చేసిన బిజెపికి.. వైసిపి, టిడిపి, జనసేనలు లొంగిపోయాయని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిని నాశనం చేసిన పాపం మోడీ, జగన్‌లదే అని అన్నారు. ఆ మోడీతో టిడిపి, జనసేన జతకట్టి అమరావతిని కాపాడుతామనటం మోసపూరితం అని చెప్పారు. బిజెపిని, మోడీని 99 శాతం ఆంధ్ర ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు. యువత ఉద్యోగం కోసం ఉపయోగపడే ఒక్క ప్రాజెక్టును గానీ , పరిశ్రమలు గాని, ఐటీ గాని తెచ్చారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్‌ రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు. విజయవాడలో గంజాయి, బ్లేడ్‌బ్యాచ్‌ ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నా పట్టించున్న నాధుడే కరువయ్యారన్నారు. కృష్ణా నది పక్కనే ఉన్నా ఇసుక దొరక్కపోవడం దారుణమన్నారు. ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కొల్పొయి , ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈఎస్‌ఐ హాస్పిటల్‌ బిల్డింగ్‌ శిథిలావస్థలో ఉన్నా పట్టించుకునే దిక్కేలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాంబే కాలనీ డిస్నీల్యాండ్‌లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. కబేళాలను నగరానికి దూరంగా ఉంచాలని డిమాండ్‌ చేశారు. ప్రజలతరుపున పోరాడే వ్యక్తిని అసెంబ్లీకి పంపిస్తే ప్రజాసమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతారన్నారు. దేశం కోసం, రాష్ట్రం కోసం కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల ఉమ్మడి పోరు కొనసాగుతోందన్నారు. విజయవాడలోనూ సమన్వయంతో వామపక్షాలు ఐక్య ఉద్యమం చేపడుతున్నాయన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు ఫణిరాజ్‌ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రత్యేక హౌదాను ప్రకటించకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. జనసేన పార్టీ 2014లో మోడీపై డిమాండ్‌ చేసి ప్రత్యేక హౌదా తీసుకురావాలని ఆనాటి ఎంపీలందరూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసి.. నేడు మోడీ కోసం జనసేన పార్టీని తాకట్టు పెట్టారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో సిపిఎంను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ప్రజా సమస్యలపై పోరాడి సెంట్రల్‌ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారని ప్రతి ఒక్క కార్యకర్త సిపిఎం గెలుపు కోసం కషి చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ చట్టసభల్లో కమ్యూనిస్టులు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షులు గురునాథం మాట్లాడుతూ..సింగ్‌నగర్‌ దగ్గర నుండి కండ్రిక వరకు ఎంతోమందికి ఇంటి పట్టాలు ఇచ్చిన ఘనత కమ్యూనిస్టులకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కాశీనాథ్‌, సిపిఎం నగర నాయకులు డివి కృష్ణ ప్రజాసంఘాల నాయకులు బి.రమణ, సెంట్రల్‌ సిటీ అధ్యక్షులు కే దుర్గారావు, సిపిఎం రాష్ట్ర నాయకురాలు కే శ్రీదేవి, చింతల శ్రీను, పేరు రాంబాబు, ఝాన్సీ , అమ్ములు తదితరులు పాల్గొన్నారు.

➡️