మోకాళ్లపై కూర్చుని, పళ్లాలు మోగిస్తూ నిరసన

Dec 26,2023 10:43 #Protest, #SSA employees, #strike
  • ఆరో రోజు కొనసాగిన ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల నిరవధిక సమ్మె

ప్రజాశక్తి- యంత్రాంగం : సర్వ శిక్ష అభియాన్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగు ఉద్యోగులు నిరవధిక సమ్మెలో భాగంగా మోకాళ్లపై కూర్చుని, పళ్లాలు మోగిస్తూ నిరసన తెలిపారు. రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. సిఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు మరిచి తమను మోసం చేశారని, ఇచ్చిన హామీని అమలు చేయకపోతే తగిన గుణపాఠం చెబుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారి సమ్మె సోమవారానికి ఆరో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఈ నెల 26 నుండి 31 వరకు వివిధ రూపాల్లో నిరసనలు, మాస్‌ర్యాలీలు కొనసాగుతాయని అన్నారు. రాష్ట్ర జెఎసి నాయకులు, మాజీ ఎంఎల్‌ఒలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరవుతారని అన్ని రకాల ఆందోళనకు ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఖాళీ విస్తరాకులతో ఉద్యోగులు నిరసన తెలియజేశారు. సమ్మె శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌ సందర్శించి మాట్లాడారు. సర్వశిక్ష ఉద్యోగులు తాము ఒంటరిని అనుకోవద్దని, పోరాటానికి సిఐటియు అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం స్పందించే వరకూ పోరాటాన్ని ఉధృతం చేయాలని కోరారు.

కౌలురైతు సంఘం, యుటిఎఫ్‌, ఎస్‌టియు సంఘాలు సంఘీభావం తెలిపాయి. విజయనగరం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సమగ్ర సర్వశిక్ష ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఫెడరేషన్‌ జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బి కాంతారావు మాట్లాడుతూ సర్వ శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమండ్‌ చేశారు. కర్నూలు జిల్లాలో నిరసనలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్‌ రాధాకృష్ణ మాట్లాడారు.

విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద సమ్మె శిబిరంలో పళ్లాలు మోగిస్తూ సర్వశిక్ష ఉద్యోగులు నిరసన తెలిపారు. వారి పోరాటానికి సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌ మద్దతు తెలిపారు. కృష్ణాజిల్లా కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌లో సర్వశిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు నిరసన తెలిపారు. సమ్మెకు పలువురు సిఐటియు నాయకులు సంఘీభావం తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో నిరవధిక సమ్మె కొనసాగింది.

➡️