కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనుకు కెవిపిఎస్‌ నాయకుల పరామర్శ

Feb 11,2024 15:00 #kodi kathi case, #KVPS
  • విచారణ లేకుండ దీర్ఘకాలం రిమాండ్‌లో మగ్గిన శ్రీనుకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌

ప్రజాశక్తి-విజయవాడ : కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో విశాఖ సెంట్రల్‌ జైల్‌ నుండి బైయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఇంటికి చేరుకున్న శ్రీనును కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, జిల్లా నాయకులు గుడే దుర్గా ప్రసాదు , శెట్టిబత్తుల తులసీరావు, యలమంచిలి బాలరాజు, శరత్‌ తదితర బృందం ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితుడికి, కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. ప్రభుత్వాలు చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్య వైఖరి తోనే బాధితుడు శ్రీను సుమారు 6 యేళ్లు జైలులోనే గడపవలసి వచ్చిందన్నారు. శ్రీనివాసరావును బలిపశువును చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కోర్టుకు హాజరు కాకపోవడం వల్ల ఇన్ని సంవత్సరాలు జైల్లో మగ్గాలిసి వచ్చిందన్నారు. ఆయనకు అండగా పౌరహక్కుల నేతలు హైకోర్థు అడ్వకేట్‌ సలీం, దళిత సంఘాల నాయకులు అండగా ఉండటం అభినందనీయమన్నారు. జైల్లో శ్రీనివాసరావు డిగ్రీ పూర్తి చెయ్యడం, ఐదువేల పైగా పుస్తకాలు ఆద్యయనం చెయ్యడం అభినందనీయమన్నారు. జైల్లో డిగ్రీ పూర్తి చేసిన శ్రీనివాసరావుకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, విచారణ లేకుండ దీర్ఘకాలం రిమాండ్‌లో మగ్గిన శ్రీనుకు నష్ట పరిహారం ఇవ్వాలని.. దీర్గకాలం విచారణ లేకుండ రిమాండు ఖైదీగా ఉండి మానసిక క్షోభకు గురైన అవసరమైన వైద్య సహాయం చెయ్యాలన్నారు. అతనికి, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని, కుటుంబానికి ఎదగివచ్చిన బిడ్డ దీర్ఘకాలిక రిమాండ్‌ ఆర్థికంగా నష్టపోయిన కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని డిమాండ్‌ చేశారు. అతనికి, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పాలకులకు ఉందన్నారు.

➡️