వామపక్ష అభ్యర్థులను గెలిపించుకుంటేనే కార్మిక రాజ్యం

– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు
ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్‌:రానున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి దానికి వంతపాడే టిడిపి, జనసేన, వైసిపిలను ఓడించి వామపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపించుకుంటేనే కార్మిక రాజ్యం వస్తుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. ప్రభుత్వ విధానాలపై ట్రేడ్‌ యూనియన్ల వర్క్‌షాప్‌ సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.ఎస్‌.రాధాకృష్ణ అధ్యక్షతన కర్నూలులోని కార్మిక కర్షక భవన్‌లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి సిహెచ్‌.నర్సింగరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోరాడీ కార్మిక చట్టాలను సాధించుకున్నామని తెలపారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు ఏ ఒక్క చట్టమూ చేయకపోగా ప్రభుత్వ రంగాలన్నింటిని ప్రయివేటుపరం చేస్తున్నారని తెలిపారు. విద్యుత్తు, ట్రాన్స్‌పోర్టు రంగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులందరూ తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తున్నారని, అలాంటి వార్తలు రాకుండా మీడియాను మోడీ తన గుప్పిట్లో పెట్టుకున్నారని అన్నారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటు వారికి అప్పగించేందుకు కనీస వేతనం ఇవ్వకుండా, నియామకాలు చేపట్టకుండా ఉన్న వారిపై పని భారం మోపుతున్నారని తెలిపారు. సిఐటియు నాయకత్వంలో పోరాటాలు చేయడం వల్లనే అంగన్‌వాడీ, ఆశ, 104, మున్సిపల్‌ కార్మికులకు ప్రభుత్వం తలంచి గ్రూప్‌ ఆఫ్‌ మినిస్ట్రీస్‌ను ఏర్పాటు చేసి రాతపూర్వకంగా హామీలు ఇచ్చిందన్నారు. కార్పొరేటర్‌ సంస్థలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తూ పార్లమెంటులో చట్టాలు చేస్తున్న బిజెపికి రాష్ట్రంలో ఉన్న టిడిపి, వైసిపి, జనసేన పార్టీలు మద్దతు తెలపడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వామపక్ష పార్టీలైన సిపిఎం, సిపిఐలను గెలిపించుకోవాలని కోరారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు మాట్లాడుతూ.. కార్మిక, ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు గెలిపించాలని కోరారు. ఈ వర్క్‌షాప్‌లో సీనియర్‌ నాయకులు బి.రామాంజనేయులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.అంజిబాబు, నంద్యాల జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు, శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్‌ పి.నిర్మల పాల్గొన్నారు.

➡️