రైతులకు శరాఘాతంగా ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ 

Dec 28,2023 10:43 #Land Titling Act
land titling act andhra pradesh

భూ హక్కులు కాపాడేందుకు చట్టంలో సవరణలు తేవాలి

రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఎపి ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రైతులు, భూ యజమానుల పాలిట శరాఘాతంగా మారనుందని రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థిరాస్తులకు సంబంధించిన యాజమాన్య హక్కులు కాపాడేందుకు చట్టంలో సవరణలు తీసుకురావాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జనవరి నెల 4, 5 తేదీల్లో జిల్లా స్థాయిలో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించాలని, ప్రజల స్థిరాస్తుల వివాదాలను పరిష్కరించే అధికారం సివిల్‌ కోర్టులకు తప్పించి రెవెన్యూ ట్రిబ్యునల్‌కు అధికారాలు కట్టబెట్టే భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కూడా రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. విజయవాడలోని దాసరి భవన్‌లో ‘భూ హక్కుల చట్టం-లోపాలు’ అనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులు, న్యాయ నిపుణులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల ఆదేశాల మేరకు కార్పొరేట్‌ సంస్థలకు భూ సేకరణకు అనుకూలంగా నీతి ఆయోగ్‌ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందన్నారు. రాష్ట్రంలో ఈ చట్టం అమలైతే భూ స్థిరాస్థిదారుల భూ హక్కులు హరించబడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని, అంబానీ, అదానీలకు నీతి ఆయోగ్‌ ద్వారా లాభాలు చేకూర్చేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇలాంటి చట్టాలు తీసుకొచ్చిందన్నారు.

భూ హక్కుల చట్టంలో 69 సెక్షన్లు ఉండగా, అందులో 7, 9, 13, 37, 46, 64 వివాదంతో కూడుకుని, యజమానులకు నష్టాలను కలిగించే సెక్షన్లుగా పరిగణించాలని వక్తలు పేర్కొన్నారు. రాష్ట్రంలో 535 సివిల్‌ కోర్టులు ఉన్నా, అధికారులతో ఏర్పాటు చేసిన 26 రెవెన్యూ ట్రిబ్యునల్‌తో వివాదాలను పరిష్కరించడం ఎలా సాధ్యమని వక్తలు ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన విధంగా ఎపి ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌కు వ్యతిరేకంగా రైతాంగం ఉద్యమ బాట పట్టాలని వక్తలు పిలుపునిచ్చారు.

ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై కేశవరావు, మర్రాపు సూర్యనారాయణ, ఎపి కౌలు రైతుల సంఘం నాయకులు పి జమలయ్య, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు ఎం శ్రీనివాసరెడ్డి, ప్రత్యేక హోదా సాధన కమిటీ కన్వీనరు చలసాని శ్రీనివాసరావు, ఎఐకెఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం వెంకటరెడ్డి, రైతు కూలీ సంఘం నాయకులు యు వీరబాబు, జాగృతి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరీదు ప్రసాద్‌, విజయవాడ బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు చలసాని అజరుకుమార్‌, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు నామాల కోటేశ్వరరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కెబి సుందర్‌ పాల్గొన్నారు.

➡️