వామపక్షాలు కాంగ్రెస్‌ భేటీ- చర్చలు అసంపూర్ణం

Mar 30,2024 08:32

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి-టిడిపి- జనసేన కూటమిని, నిరంకుశ వైసిపిని ఓడించేందుకు కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాట్లపై శుక్రవారం జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. సీట్ల సర్దుబాట్లు, ప్రజాసమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు శుక్రవారంనాడు హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని వైఎస్‌ షర్మిల నివాసంలో కాంగ్రెస్‌ నేతలు కొప్పుల రాజు, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజులతో సిపిఎం, సిపిఐ రాష్ట్ర నాయకులు విడివిగా సమావేశమయ్యారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు ఓబులేశుచర్చల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా పార్టీల బలాబలాలతోపాటు గతంలో పోటీ చేసిన అనుభవాలు, పొందిన ఓటింగ్‌, ప్రస్తుత పరిస్థితి, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. సిపిఎం ఒక పార్లమెంటు సీటు, పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ప్రతిపాదించగా చర్చల్లో ఆరు అసెంబ్లీ స్థానాలతోపాటు ఒక పార్లమెంట్‌ స్థానంపై ఏకాభిప్రాయం కుదిరింది. సిపిఐ 11 అసెంబ్లీ స్థానాలతోపాటు ఒకటి లేదా రెండు పార్లమెంట్‌ స్థానాలను కోరగా రెండు, మూడు స్థానాలు మినహా మిగిలిన స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. రాష్ట్రంలో స్థానిక పరిస్తితులను అంచనా వేసిన తర్వాత మరోసారి సమావేశం కావాలని మూడు పార్టీలు నిర్ణయించాయి. బిజెపి, వైసిపిలను ఓడించడమే పొలిటికల్‌ అజెండాగా వామపక్ష పార్టీలతో సమావేశమయ్యాయని ఆంధ్రప్రదేశ్‌ పిసిసి మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తెలిపారు. వామపక్ష పార్టీలతో మున్ముందు కూడా కలిసి పనిచేస్తామని చెప్పారు. ఎవరెక్కడ పోటీ చేస్తారనే విషయంలో అతి త్వరలో ఉమ్మడి ప్రకటన వస్తుందని ఆయన తెలిపారు.

➡️