JaganTour: వామపక్ష నాయకుల అరెస్ట్

మేం సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ఆందోళన

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : వైసిపి అధినేత, రాష్ట్ర ఆపధర్మ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేం సిద్ధం బస్సుయాత్ర కర్నూల్ జిల్లా కోడుమూరుకు విచ్చేయుచున్న నేపథ్యంలో స్థానిక కోడుమూరు సిపిఎం, సిపిఐ నాయకులు పట్టణంలో స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక పాత బస్టాండ్ లోని హిందుస్థాన్ హోటల్ ఎదుట సుమారు గంటకు పైగా ఫ్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి గఫూర్, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కామార్తి రాజు సిపిఐ మండల కార్యదర్శి డి రాజు ఆటో యూనియన్ నాయకులు ఎం మధు నాయకులు అక్బర్ ను స్థానిక కోడుమూరు పట్టణ పోలీసులు ఆందోళనను అడ్డుకొని బలవంతంగా ఆందోళనకారులను పోలీస్ వాహనం లో ఎక్కించి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిపిఎం కోడుమూరు మండల కార్యదర్శి గఫూర్ మాట్లాడుతూ కోడుమూరు పట్టణంలో గతానిక సంవత్సరాలుగా తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోందని సమస్యను పరిష్కరించేందుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి అనేకమార్లు విన్నవించామన్నారు. ప్రభుత్వం నుంచి గానీ, ప్రజా ప్రతినిధుల నుంచి గానీ ఎలాంటి చలనం లేకపోయిందన్నారు. కోడుమూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఉర్దూ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణంలో అత్యధికంగా జనాభా కలిగిన చేనేత కార్మికులకు వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

➡️