ఓటుతోనే సక్రమ పథకాలు- రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

Jan 26,2024 07:45 #ap governer, #speech

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ప్రభుత్వాలు సక్రమ పథకాలను రూపొందించాలంటే ఓటుహక్కును వినియోగించుకోవడం అత్యంత కీలకమని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. గురువారం 14వ ఓటర్‌ జాతీయ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్రంలో ఓటర్ల నమోదు ప్రక్రియలో విశేష కృషి చేసిన పలువురు అధికారులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ అభివృద్ధి గమనాన్ని నిర్ధేశించడంలో ఓటు హక్కు ప్రధానపాత్ర పోషిస్తుందని చెప్పారు. సామాజిక, ఆర్థిక ప్రగతిని నిర్దేశించే విధానాలు సక్రమంగా ఉండాలంటే పౌరులు తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లేందుకు ఎన్నికల ప్రక్రియ ముఖ్యమని, ఓటు వేయడం పౌరుడి ప్రధాన బాధ్యతని చెప్పారు. ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీ రావు, కర్నూలు జిల్లా కోడుమూరు తహశీల్దార్‌ జయన్న తదితరులను రాష్ట్ర గవర్నర్‌ సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ సభకు హాజరైన వారితో ఓటుహక్కును వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్‌ మీనా మాట్లాడుతూ జాతి నిర్మాణంలో ఓటు కీలకమైన అంశమని తెలిపారు. రాష్ట్రంలో 4.08 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 2024 తుది జాబితా నాటికి 18-19 ఏళ్ల వయసున్న కొత్త ఓటర్లు 5.07 లక్షలని అన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరం సాగేదని, యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి అన్నారు. ప్రజలకు ఓటు హక్కు కల్పించేలా మన ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుందని చెప్పారు. దేశంలో బ్రిటీష్‌ హయాంలో కేవలం కొంతమందికి మాత్రమే ఓటు హక్కు వుండేదని తెలిపారు. మహిళలకు ఓటు హక్కు వుండేది కాదన్నారు. నాడు మహిళలకు కూడా ఓటు హక్కు వుండాలని మోతీలాల్‌ నెహ్రూ మొదటిసారి ప్రతిపాదించారని తెలిపారు.

➡️