పోడు భూములకు పట్టాలివ్వండి : సిఎం రేవంత్‌కు సిపిఎం తెలంగాణ వినతి

  • వ్యవసాయ కార్మికుల కనీస వేతన జిఒను సవరించాలి
  • అర్హులైన పేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలి

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పోడు భూములకు పట్టాలివ్వాలనీ, కౌలు రైతులకు రైతు భరోసాను అమలు చేయడంతో పాటు ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో పార్టీ కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య, టి జ్యోతి, పి సుదర్శన్‌, డిజి నర్సింహారావు, జాన్‌ వెస్లీ బృందం శనివారం సచివాలయంలో సిఎంను కలిసి వినతి పత్రం అందజేసింది. ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకిచ్చిన వాగ్దానాల మేరకు ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ సిఎంను అభినందించారు. అలాగే మిగతా హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం తమతో కలిసి రావాలని సిఎం చేసిన విజ్ఞప్తికి తాము కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి ఓటమే ధ్యేయంగా పనిచేయనున్నట్టు తెలిపారు. ఎన్నికల నాటికి ఉన్న పరిస్థితులను బట్టి పొత్తు నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.

ప్రధాన డిమాండ్లు

అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పోడు రైతులకు పట్టాలివ్వాలి,- కౌలు రైతులకు రైతు భరోసాను వెంటనే అమలు చేయాలి, తొమ్మిదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న వ్యసాయ కార్మికుల కనీస వేతన జీవో సవరించాలి, అర్హులైన పేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.ఐదు లక్షలు ఇవ్వాలి, ఇండ్లస్థలాలు, ఆర్‌టిసి సమ్మె తదితర సమస్యల కోసం జరిగిన ఉద్యమాల సందర్భంగా ప్రజలు, కార్యకర్తలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించాలి, సీలింగ్‌, మిగులు భూములను నిరుపేదలకు పంచడంతో పాటు రాజకీయ పార్టీలతో అసైన్‌మెంట్‌ కమిటీలను ఏర్పాటు చేయాలి, రాష్ట్రంలో ఉన్న 73 రకాల షెడ్యూల్డ్‌ ఉద్యోగులకు పెరుగుతున్న ధరలకనుగుణంగా కనీస వేతనాలు సవరించాలి, కొత్త బస్సులు కొనుగోలు చేసి, ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి, సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో నిర్మించాలని, పోలవరం ముంపు ప్రాంతాల సర్వే చేపట్టడంతో పాటు పరిహారం చెల్లించాలి, ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, ఖాళీ పోస్టుల నియామకాలు చేపట్టాలి, ధరణి పోర్టల్‌కు సవరణలు చేసి పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలి, ప్రభుత్వరంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రాధాన్యతనివ్వాలి, చేతివృత్తుల సంక్షేమ పథకాల్లో లోపాలను సవరించి, అవినీతిని అరికట్టడంతో పాటు అర్హులందరికీ అందించాలి, అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వాలి. హెల్త్‌ కార్డుల వ్యవస్థను ప్రక్షాళన చేసి కొత్త విధానం రూపొందించాలని డిమాండ్‌ చేశారు.

➡️