వైసిపిలో చేరిన పోతిన మహేష్‌

Apr 10,2024 10:37 #join ysrcp, #pothina mahesh

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో పలువురు జనసేన, టిడిపి నాయకులు బుధవారం వైసిపిలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి వారిని సిఎం జగన్‌ ఆహ్వానించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకులు పోతిన మహేష్‌ ఇటీవల పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసి జనసేనకు గుడ్‌బై చెప్పారు. బుధవారం ఉదయం సిఎం జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరారు. జనసేన విజయవాడ నగర ఉపాధక్షులు వెన్న శివశంకర్‌, పశ్చిమ నియోజకవర్గం డివిజన్‌ అధ్యక్షులు షేక్‌ అమీర్‌ బాషా, పి.శ్రీనివాసరావు, ఎస్‌.రాముగుప్తా, పిల్లా.వంశీకృష్ణ, సోమి గోవిందరావు, ఎం.హనుమాన్‌, సయ్యద్‌ మొబీనా, జెల్లి రమేష్‌ తదితరులు జనసేన నుంచి వైసిపిలో చేరిన వారిలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి జనసేనకు రాజీనామా చేసి సిఎం జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరారు. తెలుగుదేశం నుంచి రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌ కుమార్‌ రెడ్డి వైసిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

➡️