మైనేని గొప్ప దార్శనికుడు

Jan 13,2024 08:27 #myneni venkataratnam, #vardhanthi

– వర్థంతి సభలో యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ఐకోపాధ్యాయ పత్రికా సంపాదకులు, మైనేని వెంకటరత్నం గొప్ప దార్శకుడని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూలులోని కార్మిక కర్షక భవన్‌లో మైనేని వెంకటరత్నం వర్ధంతి సభ శుక్రవారం జరిగింది. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో నక్క వెంకటేశ్వర్లు, యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు కె. సురేష్‌ కుమార్‌ పాల్గన్నారు. తొలుత మైనేని చిత్రపటానికి యుటిఎఫ్‌ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నక్క వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యుటిఎఫ్‌ ఉద్యమ వ్యవస్థాపకుల్లో అప్పారి వెంకటస్వామితోపాటు మైనేని క్రియాశీలకంగా వ్యవహరించారని తెలిపారు. సర్వీస్‌ను కూడా త్యాగం చేసి యుటిఎఫ్‌ ఉద్యమానికి పాటుపడ్డారన్నారు. ఆయన గొప్ప సాహితీవేత్త అని పేర్కొన్నారు. ప్రగతిశీల ఉద్యమానికి ఆయన సాహిత్యం ఎంతగానో దోహదపడిందన్నారు. అలాంటి మహనీయుడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ మైనేని వెంకటరత్నం రచించిన వ్యాసాలు, పుస్తకాలు సమాజం మార్పు దిశగా ఉంటాయన్నారు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమం కొనసాగించాలని కోరారు. సభలో యుటిఎఫ్‌ నేతలు యెహోషువ, హేమంత్‌ కుమార్‌, జయరాజు, ఎల్లప్ప, ఇబ్రహీం, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

➡️