మ్యానిఫెస్టోలా గణతంత్ర ప్రసంగం

  • నాలుగేళ్ల పాలన తరువాత కూడా పోలవరం పూర్తి చేస్తామని ప్రకటన

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ ప్రసంగంలో వైసిపి మ్యానిఫెస్టోకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తాము ఇచ్చిన హామీలు పూర్తి చేశామని చెబుతూనే పోలవరం అంశాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. వాస్తవంగా 2021 నాటికే పోలవరం పూర్తి చేసి నీరు పారిస్తామని వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆగేది లేదని తెలిపింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఐదోసారి జరిగిన గణతంత్ర దినోత్సవంలో పోలవరం పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అంటే ఎప్పటికి పూర్తి చేస్తారో కూడా చెప్పలేదు. ఈ ప్రసంగంలో పోలవరంతోపాటే ఆర్‌అండ్‌ఆర్‌ కూడా పూర్తి చేస్తామని తెలిపారు. అంటే ప్రాజెక్టు కన్నా ముందు ఆర్‌ఆండ్‌ఆర్‌ లేదన్నమాట! ముఖ్యంగా ఇప్పటి వరకూ సిఎం చెబుతూ వచ్చిన, ప్రకటించిన అంశాలనే గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో పొందుపరిచారు. మినహా ఏమి చేయబోతున్నామనే అంశాలకు మాత్రం ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతోపాటు వెనుకబడిన ప్రాంతాలకు నీటి ప్రాజెక్టులు అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. మూడేళ్లలో ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం గవర్నర్‌ ప్రసంగంలో వెనుకబడిన ప్రాంతాలకు నీటిని అందించడమే ధ్యేయంగా ప్రాజెక్టులు చేపడతామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీల విషయంలో ఎన్నికల ముందు ఏమి చెప్పారో అవే అంశాలూ అటూ ఇటుగా ఉన్నాయి తప్ప ఫలానా మేజర్‌ ప్రాజెక్టు పూర్తి చేశామనే విషయాన్ని ఎక్కడా స్పష్టం చేయలేదు. రాబోయే ఎన్నికలకు మ్యానిఫెస్టోలా గవర్నర్‌ ప్రసంగాన్ని మార్చేశారు. గత ఐదేళ్లుగా చెబుతున్న అంశాలనే కొత్తగా చెప్పారు. రూ.13 లక్షల కోట్లతో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని చెబుతూనే 133 భారీ పరిశ్రమలు మాత్రమే ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దీనిపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. పెట్టుబడుల వల్ల 40 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు 133 ప్రాజెక్టుల ద్వారా సుమారు లక్షన్నరమందికి ఉపాధి కల్పించామని తెలిపారు. చిన్నాచితక, స్టార్టప్‌లు పెట్టామని చెబుతున్నా కొన్ని స్టార్టప్‌లు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా అంబేద్కర్‌ విగ్రహ ప్రస్తావన చేయడం ద్వారా సామాజిక అంశాలను ముందుకు తీసుకొచ్చారు.

➡️