ఫాసిస్టు దోపిడీకి విరుగుడు మార్క్సిస్టు సిద్ధాంతం

  •  మార్క్స్‌ వర్థంతి సందర్భంగా పలువురు నివాళి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ పెట్టుబడిదారీ దోపిడీ, ఫాసిస్టు విధానానికి మార్క్స్‌ సూచించిన సిద్ధాంతం ఆచరణే విరుగుడని పలువురు వక్తలు పేర్కొన్నారు. మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కార్ల్‌మార్క్స్‌ 141వ వర్థంతి సందర్భంగా మార్క్స్‌ ఎంగెల్స్‌ విగ్రహ కమిటీ ఆధ్వర్యాన గురువారం విజయవాడ హనుమాన్‌పేటలోని మార్క్స్‌, ఎంగెల్స్‌ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. అప్పటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న రాచరిక వ్యవస్థపై తిరుగుబాటు సాగించి విప్లవ విజయాలు సాధించిన సోవియట్‌, చైనా, క్యూబా, వియత్నాం వంటి అనేక దేశాలు సోషలిజం, కమ్యూనిజం బాటలో నడిచాయని తెలిపారు. మార్క్సిజాన్ని పెద్ద భూతంగా చూపించి అంతం చేయాలని సామ్రాజ్యవాద దేశాలు కుట్రలు చేశాయని అన్నారు. ప్రస్తుతం దేశంలో బిజెపి ఆధ్వర్యాన ఫాసిస్టు పాలన నడుస్తోందని, మార్క్సిజం స్ఫూర్తితో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పనిచేయాలని కోరారు.
సిపిఐ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ.. సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచం నేడు సామ్రాజ్యవాద శక్తుల గుప్పెట్లో ఉందని, దాన్నుండి రక్షించాలని కోరారు. సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు కె పొలారి మాట్లాడుతూ.. పీడిత ప్రజల విముక్తి కోసం మార్క్స్‌, ఎంగెల్స్‌ సిద్ధాంతాన్ని తీసుకొస్తే లెనిన్‌, స్టాలిన్‌ అమలు చేసి చూపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, కె సుబ్బరావమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు జయరాం, రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై కేశవరావు, పిఎన్‌ఎం రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ అనిల్‌, సిపిఐ రాష్ట్ర నాయకులు ఈశ్వరయ్య, రవీంద్రనాథ్‌, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, రైతు కూలీ సంఘం నాయకులు ముప్పాళ్ల భార్గవశ్రీ, ఇస్కఫ్‌ కార్యదర్శి మోతుకూరి అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు. తొలుత అనిల్‌, చంద్రానాయక్‌, పిచ్చయ్య విప్లవ గేయాలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి బుడ్డిగ జమిందార్‌ అధ్యక్షత వహించారు.

 

➡️