మాట జవదాట్టొద్దు  వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి : అధికారులు మాట జవ దాటితే ఏం అవుతారో చెప్పనని, చేసి చూపిస్తానని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుతో కలిసి సోమవారం శ్రీకాకుళం నగరం వచ్చిన సందర్భంగా పౌర సన్మానం జరిగింది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. మండలంలోని ఏ కార్యాలయానికైనా టిడిపి నాయకులు, కార్యకర్తలు పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లండని, వారే కుర్చీలు వేసి గౌరవిస్తారని చెప్పారు. మంగళవారం నిర్వహించే సమీక్షా సమావేశంలో అధికారులకు ఇదే విషయంపై ఆదేశాలు ఇస్తానని చెప్తూ పై వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఏదో చేసేయాలని కార్యకర్తల్లో ఆతృత ఉందని, వారిని ఆదుకునే పని ఒక్కొక్కటిగా చేస్తామని చెప్పారు. ఆర్థిక పరిపుష్టి కలిగించడంతో గ్రామాల్లో వారికి గౌరవం పెంచే పనిచేస్తామన్నారు. అధికారం వచ్చిందని సంబరపడిపోవద్దని, రాష్ట్ర ఖజానాను వైసిపి ప్రభుత్వం ఖాళీ చేసేసిందన్నారు. అన్ని వ్యవస్థలను జగన్‌ సర్వనాశనం చేశారని విమర్శించారు. ఐదారు నెలల్లోనే పాలనను గాడిన పెడతామన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని, చట్టం తన పని తాను చేస్తుందని హెచ్చరించారు. సమావేశంలో విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

➡️