రేపటిలోగా మెగా డిఎస్‌సి.. లేదంటే సిఎం క్యాంపు కార్యాలయం ముట్టడి : డివైఎఫ్‌ఐ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్‌సి ప్రకటించాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. మంగళవారం లోపు ప్రకటించకుంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఫెడరేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, జి రామన్న హెచ్చరించారు. విజయవాడలోని బాలోత్సవ భవనంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా డిఎస్‌సి అంటూ నిరుద్యోగులను నయవంచన చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో 1.88 లక్షల ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం 1.69 లక్షలు మాత్రమే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిందని చెప్పారు. దాదాపు 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇవి కాకుండా ఈ నెల చివరి నాటికి మరో 5 వేల మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందనున్నారని తెలిపారు. 117 జిఓ పేరుతో మరో 10 వేల ఉపాధ్యాయ పోస్టులను, తెలుగు మీడియం పేరుతో మరో 15 వేల పోస్టులను రద్దు చేసిందని వివరించారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో 2 వేల పాఠశాలలు మూతపడ్డాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 9 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని వివరించారు. వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం లేవని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు డ్రాపౌట్లు కావడం లేదా? అని ప్రశ్నించారు. వీరంతా ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరుతున్నారని, రెండేళ్లలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్‌ అయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్‌సి కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యావిధానం-2020ను రాష్ట్రంలో అమలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహించారు. తక్షణమే మెగా డిఎస్‌సి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి కృష్ణ, ఎన్‌ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️